కాంగ్రెస్​లోకి వలసలు స్టార్ట్.. అధికార పార్టీపై అసంతృప్తే కారణమా..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-23 02:37:31.0  )
కాంగ్రెస్​లోకి వలసలు స్టార్ట్.. అధికార పార్టీపై అసంతృప్తే కారణమా..?
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆ పార్టీలోకి క్రమంగా చేరికలు పెరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు టికెట్లు ఖరారు చేసి అభ్యర్థులను ప్రకటిస్తే వలసలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు నేతలు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా అధికార పార్టీ నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని చెబుతున్నారు.

ఇప్పటికే చేరిన ముఖ్య నేతలు

ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఆయా రాజకీయ పార్టీల నుంచి కప్పదాట్లు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య నేతలను గురి చూసి కొడుతోంది. ముఖ్యంగా అధికార పార్టీలో బలమున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఆయన దూతలు ముఖ్యనేతల వేటలో పడ్డారు. ఇప్పటికే నిర్మల్‌కు చెందిన సీనియర్ నేత కే శ్రీహరి రావు భారత్ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముందు జెడ్పీటీసీల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సారంగాపూర్ జెడ్పీటీసీల సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరి అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

క్యూలో మరికొందరు..

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నేత ఒకరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం మొదలైంది. మంచి హోదాలో ఉన్నప్పటికీ పీసీసీ రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. అలాగే చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది.

అధికార హోదాలో ఉన్న తూర్పు జిల్లా మహిళా నేత ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేకు పోటీచేస్తే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే నిర్మల్ ప్రాంతానికి చెందిన ఒక మాజీ శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన నాటికి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అధికార పార్టీపై అసంతృప్తితోనేనా...

కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా పెరుగుతుండడం చూస్తే జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడల కారణంగా అధికార పార్టీ సీనియర్లు పార్టీని వీడుతున్నట్లు చర్చ ఉంది. అయితే బీజేపీ నేతలు సైతం కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం ఆ పార్టీని కలవరపెడుతోంది.

కాంగ్రెస్ పార్టీలో జోష్...

కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతుండడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతుంది. గురువారం నిర్వహించిన కార్యక్రమం జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో ఆశించిన దానికన్నా ఎక్కువగానే జయప్రదం అయింది. ఎన్నికల సమయం నాటికి అధికార పార్టీకి బలమైన ప్రత్యర్థిగా తామే నిలుస్తామన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

Also Read:

బీజేపీలో వేరు కుంపట్లు.. కలిసి నడుస్తామంటూనే సొంతంగా ఆఫీసులు!

Advertisement

Next Story

Most Viewed