- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీసీల్లో 15 కులాలకే రూ.లక్ష సాయం.. ప్రధాన కొలమానం అదే!
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష సాయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీసీ కుల వృత్తులకు రూ.లక్ష సాయం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తాజాగా మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించే జోవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ముస్లిం, క్లిస్టియన్ కుటుంబాలన్నింటికీ సాయం అందించేందుకు ఆర్థిక, మైనారిటీ సంక్షేమ శాఖలు రెడీ అవుతున్నాయి. పేదరికాన్ని కొలమానంగా తీసుకున్న ప్రభుత్వం ఆ కుటుంబాలకు ఎమ్మార్వోలు ఇచ్చే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ప్రామాణికం కానున్నది. ఆ సర్టిఫికెట్స్ ఆధారంగానే అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. గ్రామీణ ప్రాంతంలో రూ.లక్షన్నర, నగరాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ లబ్ధిదారులుగా గుర్తించనున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లోపు కొంత మందికే ప్రయోజనం కల్పించి, ఆ తర్వాత దశల వారీగా స్కీమ్‌ను అమలు చేయాలని ఆలోచిస్తున్నది. ముస్లిం ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.లక్ష సాయాన్ని ప్రకటించిందని ప్రజల్లో ఓపెన్ టాక్ మొదలైంది. దశాబ్ది వేడుకల సందర్భంగా చేతివృత్తులకు చేయూత స్కీమ్‌ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 15న బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన సొంత నియోజకవర్గంలో 15 మందికి చెక్కుల రూపంలో సాయం అందించారు. అక్కడ మినహా మిగిలిన ఏ జిల్లాలోనూ ఈ స్కీమ్ ప్రారంభం కాలేదు. దీంతో బీసీల్లో అసంతృప్తి నెలకొన్నది. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల్లో కుటుంబాలన్నింటికీ సాయం అందించాలనుకుంటున్న ప్రభుత్వం.. బీసీల్లో మాత్రం కొన్ని కులాలకే అందించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
బీసీల్లో కులవృత్తులవారికే :
రాష్ట్రంలో బీసీ జనాభా 56% ఉంటే మైనారిటీలు 14% ఉన్నట్టు సమగ్ర కుటుంబ సర్వే మొదలు పలు సందర్భాల్లో ప్రభుత్వం పేర్కొన్నది. జనాభా ప్రాతిపదికన సంక్షేమం అందాలంటూ బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల బీసీ సంఘాలన్నీ ఏకమై ఆత్మగౌరవం నినాదాన్ని తెరమీదకు తెచ్చాయి. రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి పార్టీల నేతలు అనివార్యంగా బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేతి వృత్తులకు చేయూత పేరుతో రూ.లక్ష సాయం స్కీమ్‌ను 15 కులాలకే పరిమితం చేసింది. గౌడ్, యాదవ, పద్మశాలి లాంటి పలు కులాలను అందులో చేర్చకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బీసీ కులాలకు లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం విమర్శలకు దారితీసింది. బీసీల్లో దాదాపు 112 కులాలు ఉంటే కేవలం 15 కులాలకే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించడంతో మిగతా కులాలవారు బహిరంగంగానే తప్పుపట్టారు. కానీ, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల మొదలు అధికార పార్టీకి చెందిన నేతలెవ్వరూ స్పందించలేదు. ప్రభుత్వ అధికారులు సైతం సైలెంట్‌గానే ఉండిపోయారు. ఈ అసంతృప్తి, పెదవి విరుపులు ఉన్న సమయంలోనే మైనార్టీల స్కీమ్‌ను ప్రభుత్వం తెరమీదకు తీసుకురావడంతో బీసీ ప్రజలకు పుండు మీద కారం చల్లినట్లయింది.
మైనారిటీలతో పోల్చుకుంటున్న బీసీలు
ప్రభుత్వ జీవో ప్రకారం మైనారిటీ కుటుంబాలన్నింటికీ రూ.లక్ష చొప్పున సాయం అందనున్నది. సమగ్ర కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మైనారిటీ కుటుంబాలు సుమారు 6 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉన్నట్టు అంచనా. కానీ బీసీ కుటుంబాల సంఖ్య మాత్రం సుమారు 47 లక్షలకు పైనే. చేతివృత్తులకు చేయూత స్కీమ్‌కు ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కేవలం 5.2 లక్షల కుటుంబాల నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. వారికి మాత్రమే సాయం అందనున్నది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల్లో సాయం కేవలం ఐదు లక్షల కుటుంబాలకేనా అనే చర్చలు మొదలయ్యాయి. సుమారు రెండు కోట్ల మంది ఉండే బీసీలకు ప్రభుత్వం లక్ష సాయం స్కీమ్‌కు రూ.5,280 కోట్లు ఖర్చు చేస్తుండగా, 40 లక్షల జనాభా ఉండే మైనారిటీలకు మాత్రం రూ.6,000 కోట్లకు పైగా ఖర్చు చేసే అంశాన్ని చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ వైపు వెళ్లకుండా కట్టడికేనా?
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నదనే చర్చలు జరుగుతున్నాయి. మైనార్టీలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో అలర్ట్ అయిన కేసీఆర్ ఆ వర్గాలను అట్రాక్ట్ చేసేందుకు రూ.లక్ష సాయం స్కీమ్‌ను తెరమీదికి తెచ్చినట్టు బీఆర్ఎస్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కొన్ని కుటుంబాలకు ఈ సాయాన్ని అందించి మైలేజ్ పొందాలని భావిస్తున్నారు. త్వరలో ఈ స్కీమ్ కోసం విధివిధానాలు ఖరారు చేసి, దరఖాస్తులను తీసుకునే ప్రాసెస్‌ను మొదలు పెట్టనున్నది ప్రభుత్వం. ఆగస్టు చివరలో కొందరికి ఆర్థిక సాయం అందించాలని టార్గెట్ పెట్టుకున్నది.
నిధుల కొరతతో అరకొరాగానే అమలు:
బీసీ కులవృత్తులకు లక్ష ఆర్థిక సాయం అందించే స్కీమ్‌ను ఆర్భాటంగా ప్రకటించి మొక్కుబడిగా ప్రారంభించినా అనుకున్నట్టుగా గాడిన పడలేదు. నిధుల కొరత కారణంగానే ప్రభుత్వం ప్రకటనతో సరిపెట్టింది. అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. ఈనెల 15 నుంచి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 40 వేల మందికి ఈ సాయం అందించేలా బడ్జెట్ నుంచి రూ.400 కోట్ల మేర రిలీజ్ ఆర్డర్‌ను జారీచేసింది. కానీ ఖజానాలో నిధులు లేకపోవడంతో చెక్కులు బౌన్స్ కావద్దనే ఉద్దేశంతో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడాన్ని ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మైనార్టీలకు రూ.లక్ష సాయం స్కీమ్‌ను హడావుడిగా ప్రకటించింది. కానీ ఆర్థిక శాఖ అధికారులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. విధివిధానాల రూపకల్పన మొదలు.. లబ్ధిదారుల ఎంపిక, చెక్కులు ఇచ్చే సమయానికి నిధులను సమకూర్చుకోవడం సవాలుగా మారింది. సెక్రటేరియట్ అధికారుల్లోనూ తీవ్ర స్థాయిలో అసహనం కనిపిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మైనార్టీ కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించాలంటే దాదాపు రూ.6 వేల కోట్లు అవసరం అవుతాయని లెక్కలు వేశారు. అంతంత మాత్రంగా ఉన్న సొంత నిధుల సమీకరణపై ఆధారపడి ఈ స్కీమ్‌ను అమలు చేయలేమన్న ఆచరణాత్మక ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారు. బీసీ స్కీమ్ లబ్ధిదారులు దాదాపు 5.28 లక్షల మంది ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 40 వేల మందికే పరిమితం చేయడానికి నిధుల కొరతే కారణమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మైనార్టీలకూ ఇదే తరహా స్కీమ్‌ను అమలు చేయాలంటే డబ్బులు ఎలా అని ఎదురు ప్రశ్నించారు. దళితబంధు, గృహలక్ష్మి, చేతివృత్తులకు చేయూత పథకాలను అటకెక్కించినట్టుగానే మైనార్టీలకు లక్ష సాయం స్కీమ్ కూడా అదే తీరులో పొలిటికల్ మైలేజ్‌కు ఉపయోగించుకునేలా కాగితాలకే పరిమితమవుతుందేమో అనే చర్చలు ప్రజల్లో జోరుగా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి :: Telangana :: ఐదేండ్లలో తెలంగాణ అప్పులు డబుల్.. సౌతిండియాలో టాప్..!