వామపక్ష పార్టీలతో పొత్తుపై స్పందించిన భట్టి విక్రమార్క

by Javid Pasha |   ( Updated:2023-10-10 05:55:12.0  )
వామపక్ష పార్టీలతో పొత్తుపై స్పందించిన భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో పొత్తుల రాజకీయం తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో మహాకూటమిలో కామ్రేడ్స్‌ను కలుపుకున్న కాంగ్రెస్.. ఈ సారి కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో వామపక్ష పార్టీల ప్రాబల్యం ఉండటంతో దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు వామపక్ష పార్టీలు కూడా పొత్తుకు సై అంటున్నాయి.

కాంగ్రెస్‌తో పొత్తుపై గత కొద్దిరోజులుగా సీపీఎం, సీపీఐ చర్చులు జరుపుతోంది. పొత్తుకు ఆ రెండు పార్టీలు అంగీకారం కూడా తెలిపాయి. ఈ మేరకు సీట్లు సర్దుబాటు కూడా ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. మునుగోడు, భద్రాచలం, కొత్తగూడెం, మిర్యాలగూడ టికెట్లను సీపీఎం, సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ ఆమోదం తెలిపినట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను వామపక్ష నేతలు కొట్టివేయగా.. తాజాగా పొత్తులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.

వామపక్ష పార్టీలతో పొత్తు ఇంకా ఖరారు కాలేదని భట్టి క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చే వార్తలన్నీ ఊహాగానాలేనని, చర్చలు ఇంకా జరుగుతున్నాయని అన్నారు. వామపక్ష పార్టీలు అడుగుతున్న సీట్లకు సంబంధించిన సమాచారాన్ని అధిష్టానానికి పంపుతున్నామని, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో వామపక్షాలు కలిశాయి. దీంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌తో లెఫ్ట్ పార్టీలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Next Story