ప్రభుత్వాలు మారినా పథకాలు ఆగవు.. చరిత్ర నిరూపించిన సత్యమిది..!

by GSrikanth |
ప్రభుత్వాలు మారినా పథకాలు ఆగవు.. చరిత్ర నిరూపించిన సత్యమిది..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వాలు మారినా పథకాలు ఆగడం లేదు. అంతే కాకుండా వాటికి మెరుగులు దిద్దడం, మరింత అదనంగా సాయం పెంచడం, మరికొన్ని సెక్షన్లకు విస్తరించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. వివిధ పార్టీలు పేదల సంక్షేమం కోసం మేనిఫెస్టోల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం నాలుగైదు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పరిపాలనా సంస్కరణలు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. దానికి ముందు, తర్వాత కాంగ్రెస్ తీసుకొచ్చిన స్కీములు చాలా వరకు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పూర్తిగా ఎత్తివేసే సాహసం ఏ పార్టీ చేయలేకపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా పలు పథకాలు ఉనికిలోకి వచ్చాయి. కొత్త ప్రభుత్వాలు వస్తే ఈ స్కీములు కొనసాగుతాయో లేవోననే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. కానీ నాలుగైదు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే పాపులర్ స్కీములుగా గుర్తింపు పొందినవి యధావిధిగా అమలవుతూనే ఉన్నాయి. ప్రజలకు ఈ స్కీములను ఒకసారి అందించిన తర్వాత వాటిని ఎత్తివేయడంలో ఉండే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీలు వాటిని కొనసాగించాలనే విధాన నిర్ణయాలనే తీసుకుంటున్నాయి. పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ఎత్తివేస్తే వారి ఆగ్రహం, వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో పార్టీలకు తెలియందేమీ కాదు.

రూ.2కు కిలో బియ్యం స్కీమ్

ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. అప్పటి వరి ఉత్పత్తి, ప్రజల కొనుగోలు సామర్థ్యం, పేదరికం, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌ను ఆ తర్వాత ప్రభుత్వాలు యధావిధిగా కొనసాగించాయి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో అది కిలో రూపాయిగా మారింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన డ్వాక్రా సంఘాలు, వృద్ధులకు పింఛన్లు, ఇండ్లు లేని పేదలకు పక్కా గృహాల నిర్మాణం తదితరాలన్నీ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దు, వికేంద్రీకరణలో భాగంగా ప్రవేశపెట్టిన మండలాఫీసు వ్యవస్థ, జిల్లా పరిషత్‌లలో బీసీలకు రిజర్వేషన్లు, సింగిల్ విండో సిస్టమ్, మహిళా విశ్వవిద్యాలయం, తెలుగుగంగ ప్రాజెక్టు.. ఇలాంటివన్నీ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి.

వైఎస్సార్ హయాంలో పాపులర్ స్కీమ్‌లు

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలను ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి (కాంగ్రెస్), చంద్రబాబునాయుడు (టీడీపీ) యధావిధిగా కొనసాగించారు. చంద్రబాబునాయుడు ఎక్కువగా పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధి పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. కరువు పరిస్థితులను ఎదుర్కోడానికి రైతులకు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్), ఇజ్రాయిల్ నమూనా సాగు విధానం, జన్మభూమి పథకం, శ్రమదానం తదితరాలను ప్రవేశపెట్టారు. రోడ్ల నిర్మాణం, ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బయో టెక్నాలజీ, ఫార్మా రంగం తదితరాలపై కేంద్రీకరించారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత విప్లవాత్మకమైన సంస్కరణలు ఉనికిలోకి వచ్చాయి. పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల సమస్యలను కళ్లారా చూసి వాటికి పరిష్కారంగానే పలు స్కీమ్‌లకు అంకురార్పణ చేశారు.

పేదలకు మెరుగైన, కార్పొరేట్ వైద్యం అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ, విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, పల్లెల్లోని ప్రజలకు తక్షణ వైద్య సేవలను అందేలా 108 ఆంబులెన్సులు, రైతులను అప్పుల భారం నుంచి విముక్తి చేయడానికి రుణమాఫీ, సాగునీటి సౌకర్యాలను కల్పించడానికి జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్.. వంటి పాపులర్ స్కీమ్‌లను అమల్లోకి తెచ్చారు. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా పథకాల ఫలాలు మాత్రం ప్రజలకు అందుతూనే ఉన్నాయి. వృద్ధులకు పింఛన్ల కింద ఎన్టీఆర్ హయాంలో స్వల్పంగా ఉన్న ఆర్థిక సాయం కాలానుగుణంగా, రాష్ట్ర ఆర్థిక స్థోమతకు తగినట్టుగా తదుపరి ప్రభుత్వాలు పెంచుతూ వస్తున్నాయి.

కేసీఆర్ పథకాలు కొనసాగుతాయా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాత స్కీములను సైతం కేసీఆర్ యధావిధిగా కొనసాగించారు. మహిళా పొదుపు సంఘాలు, వడ్డీలేని రుణాలు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళితబంధు, రైతుబీమా లాంటి కొత్త స్కీములనూ తెరపైకి తెచ్చారు. కాంగ్రెస్ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పంట పెట్టుబడి సాయాన్ని ‘రైతుబంధు’ పేరుతో అమల్లోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల్లోని పథకాల తరహాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సైతం అమలవుతున్నాయి. వృద్ధాప్య పింఛన్ల ఆర్థిక సాయాన్ని పెంచడంతో పాటు ఒంటరి మహిళలు, బీడీ మహిళా కార్మికులు, వితంతవులు తదితరులకు కూడా కేసీఆర్ వర్తింపజేశారు.

ఈ పథకాలు కొనసాగుతాయో లేవోననే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. ప్రజాదరణ పొందిన, పేదలకు ఫలాలను అందిస్తున్న స్కీములను ఎత్తివేయడానికి నాలుగైదు దశాబ్దాలుగా ఏ పార్టీకి కూడా ధైర్యం చాలలేదు. అందుకే ఎన్టీఆర్ హయాం నాటివి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు అమలవుతున్న పథకాలను ఎత్తివేయడానికి ఏ పార్టీ సాహసించే అవకాశం లేకుండాపోయింది. పైగా వాటి కింద లబ్ధిదారులకు అందిస్తున్న సాయాన్ని మరింత పెంచుతామంటూ మేనిఫెస్టోలు, గ్యారంటీల ద్వారా పార్టీలు భరోసా కలిగిస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలు ఎన్ని మారినా పాపులర్ వెల్ఫేర్ స్కీమ్‌లు మాత్రం యధావిధిగా కంటిన్యూ అవుతున్నాయన్నది 40 ఏండ్లుగా ప్రజలకు స్వీయానుభవం.

Advertisement

Next Story