మాంచి ఊపుమీదున్న రేవంత్‌కు బిగ్ షాక్.. రేపు ఏం జరుగబోతోంది?

by GSrikanth |
మాంచి ఊపుమీదున్న రేవంత్‌కు బిగ్ షాక్.. రేపు ఏం జరుగబోతోంది?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2015లో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసు విచారణ మళ్లీ తెరమీదకు వచ్చింది. గతేడాది సెప్టెంబరులో ఈ కేసు విచారణ జరగ్గా షెడ్యూలు ప్రకారం అక్టోబరు 3న మళ్లీ సుప్రీంకోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందుకు రానున్నది. ఆ మరుసటి రోజున ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు కూడా మరో ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. ఈ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబును టార్గెట్‌గా చేస్తూ ఏపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసులో తనను నిందితుడిగా తప్పించాలంటూ తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విజ్ఞప్తి చేశారు.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డిని (అప్పట్లో తెలుగుదేశం ఎమ్మెల్యే) అవినీతి నిరోధక శాఖ నిందితుడిగా పేర్కొన్నది. జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా కొంతకాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత హైకోర్టుకు మారింది. విచారణ అనంతరం వెలువడిన తీర్పును సవాలు చేస్తూ రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును 2021లో ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ ఏసీబీ పరిధిలోనిది కాదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్రయల్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ అంశంలో విభేదించిన రేవంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అప్పట్లో విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకు స్టే ఉత్తర్వులను జారీచేసింది.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ద్వారా మొత్తం వ్యవహారం నడిపింది చంద్రబాబునాయుడేనని, ఏసీబీ అధికారుల దగ్గరున్న ఆడియో రికార్డుల్లోని గొంతు కూడా ఆయనదేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టులో 2017 డిసెంబరులో దాఖలైంది మొదలు మొత్తం ఎనిమిదిసార్లు విచారణ జరిగింది. ఇకపైన తొమ్మిదోసారి విచారణకు రానున్నది. సుప్రీంకోర్టులోని వేర్వేరు ధర్మాసనాలు 2018లో, 2020లో ఒక్కోసారి విచారించగా 2022లో ఐదుసార్లు విచారించింది. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లతో పాటు సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌తో కనెక్ట్ చేసి మంగళవారం సుప్రీంకోర్టు విచారించనున్నది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తరఫున న్యాయవాది కూడా వాదనలు వినిపించనున్నారు.

మరోవైపు ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లలో క్రిమినల్ అప్పీల్, రిట్ పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించనున్నది. ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ ఏసీబీ కోర్టు త్వరితగతిన పూర్తి చేయాలని ఆ క్రిమినల్ అప్పీల్ పిటిషన్‌లో రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును కోరారు. గతంలో జరిగిన విచారణల సందర్భంగా కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ఏసీబీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దాన్ని పరిశీలించిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది సైతం అభిప్రాయాలను (రిజైండర్) కోర్టుకు సమర్పించారు. గతేడాది సెప్టెంబరులో జరిగిన విచారణకు కొనసాగింపుగా బుధవారం విచారణ జరగనున్నది.

ఒకే కేసుకు సంబంధించి రెండు రోజుల వ్యవధిలోనే ఈ పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు రానుండడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు చంద్రబాబునాయుడు వేరే కేసుల్లో రాజమండ్రి జైల్లో ఉండగా ఇప్పుడు ఓటుకు నోటు కేసు విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్ పిటిషన్లు విచారణకు రానుండడం గమనార్హం. అవినీతి నిరోధక శాఖ ట్రయల్ తన కేసుకు వర్తించదంటూ గతంలోనే రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టుకు తెలియజేసినందున మంగళవారం జరిగే విచారణలో ధర్మాసనం ఎలాంటి వాదనలను వింటుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సుప్రీంకోర్టులో జరిగే వాదనలు రాజకీయ ప్రాధాన్యతకు ఆస్కారం ఇవ్వనున్నాయి.

తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తరహా రాజకీయ పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కేసు తెరమీదకు రావడం విశేషం. ఇప్పటికే గులాబీ నేతలు రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారు. ‘ఓటుకు నోటులో దొరికిన దొంగ.. సూట్ కేసుల్లో డబ్బులు పంచుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.. ఇప్పుడు టికెట్ల కోసం కోట్ల రూపాయల్లో డబ్బులు దండుకుంటున్నాడు..’ లాంటి కామెంట్లతో సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు త్వరలో విడుదలవుతుందనుకుంటున్న సమయంలో ఈ కేసులో సుప్రీంకోర్టులో జరిగే వాదనలు, ధర్మాసనం వెలువరించే ఉత్తర్వులు, ఆర్గ్యుమెంట్ల సందర్భంగా వినిపించే అబ్జర్వేషన్లు కీలకంగా మారనున్నాయి. ప్రత్యర్థులు పొలిటికల్‌గా వాడుకోడానికి అస్త్రాలుగా మారే అవకాశమున్నది.

Advertisement

Next Story