మైనంపల్లి చేరికతో టీ.కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. పార్టీలో సీనియర్ల గుస్సా!

by GSrikanth |
మైనంపల్లి చేరికతో టీ.కాంగ్రెస్‌లో కొత్త లొల్లి.. పార్టీలో సీనియర్ల గుస్సా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి చేరిక తర్వాత మరో కొత్త లొల్లి మొదలైంది. పార్టీలో చేరకముందే మూడు టికెట్ల ప్రపోజల్ పెట్టగా మైనంపల్లితోపాటు ఆయన కొడుకుకు టికెట్లు ఇచ్చేందుకు హై కమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో పార్టీలోని సీనియర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడినోళ్లను కాదని.. ప్యారాచూట్ నేతలకు అడిగిన వెంటనే సీట్లు ఇవ్వడంపై అభ్యంతరం చెబుతున్నారు. పైగా స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని.. హుటాహుటిన మైనంపల్లి అంశంపై థాక్రేతో మాట్లాడటం, ఆ వెంటనే రాహుల్ గాంధీకి వివరించడం, మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరికలు జరగడం వంటివన్నీ రెండు మూడు రోజుల్లోనే పూర్తయ్యాయి. దీన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. ఒకవైపు బీసీలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, ఎస్టీ నేతలు టికెట్ల కోసం ప్రాధేయపడుతుంటే ఆశించిన స్థాయిలో స్పందించని రేవంత్ మైనంపల్లి అంశాన్ని కేవలం మూడు రోజుల్లో క్లియర్ చేయడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు.

ఉదయ పూర్ డిక్లరేషన్‌కు ‘బ్రేక్’...

ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వకూడదని ఉదయ పూర్ డిక్లరేషన్ స్పష్టం చేస్తుంది. అయితే ఐదేళ్లు పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తే కన్సిడర్ చేసేందుకు పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని పొందుపరిచారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ, చట్ట సభల్లో ఇతర పోస్టుల్లో పనిచేసి ఉంటే ఈ నియమం వర్తించదని పేర్కొన్నారు. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చేవాళ్లకు రెండు టికెట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదనే రూల్ ఉన్నది. ఈ నిబంధన ప్రకారం మైనంపల్లి ఫ్యామిలీకి రెండు టికెట్లు వర్తించవు. కానీ రేవంత్ జోక్యంతోనే స్పెషల్ కేసుగా రెండు టికెట్లు ఇచ్చారనేది సీనియర్ల వాదన. మైనంపల్లి చేరికతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఉదయ్ పూర్ డిక్లరేషన్ కు కూడా బ్రేకులు పడ్డాయని కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరు తెలిపారు.

పట్టు వదిలేదిలే...?

మైనంపల్లి కుటుంబానికి మెదక్, మల్కాజిగిరి టికెట్లు కేటాయించినట్లే తమ కుటుంబాలకు చెందిన వ్యక్తులకూ ఇవ్వాలని ఢిల్లీ హైకమాండ్ పై రాష్ట్ర పార్టీ సీనియర్లు ఒత్తిడి తేవడానికి సిద్ధమవుతున్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్ల కోసం అప్లై చేసుకున్న కీలక నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితర ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ల కుటుంబాల నుంచి రెండు టికెట్లు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. స్క్రీనింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మూడు సెగ్మెంట్ లను గెలిపిస్తా...

తాను పోటీ చేస్తున్న మల్కాజ్ గిరితో పాటు మెదక్, మేడ్చల్ నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించేందుకు తాను అన్ని విధాలుగా కృషి చేస్తానని మైనంపల్లి పార్టీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనేందుకు తానే ఖర్చు పెట్టుకుంటానని ఢిల్లీ హై కమాండ్ ముందు అంగీకరించినట్లు తెలుస్తోన్నది. దీంతో మైనంపల్లి ఇమేజ్, కాంగ్రెస్ కేడర్ కలిస్తే మూడు సీట్లు సులువుగా గెలవచ్చనే అభిప్రాయంలో పార్టీ ఉంది. మరోవైపు పార్టీలో మిగతా సీనియర్లు రెండు టికెట్లు ఆశిస్తున్నారే తప్పా పార్టీ గెలుపు కోసం డబ్బు ఖర్చు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదనేది కేడర్ వాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఆర్థిక అవసరాలు ముఖ్యమేనని, ఇలాంటి నేపథ్యంలో సీనియర్లు డబ్బు ఖర్చు పెట్టేందుకూ ముందుకు రావాలని క్షేత్రస్థాయిలోని నాయకత్వం కోరుతున్నది.

Advertisement

Next Story