- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
35 నియోజకవర్గాల్లో ఆ ఓటు బ్యాంకే కీలకం.. ఆకర్షించేందుకు బీఆర్ఎస్ పాట్లు
దిశ, తెలంగాణ బ్యూరో: ముస్లిం ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. ఆ వర్గానికి చెందిన రెండు ప్రధాన సంఘాలు ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు తెలిపాయి. దీంతో గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. మైనార్టీలు తమకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తే, అధికారం చేజారిపోవడం ఖాయమని భావిస్తున్నారు. దీంతో చివరి ప్రయత్నంగా ముస్లిం ఓటర్లలో కొందరిని తమ వైపు తిప్పుకునేందుకు గులాబీ లీడర్లు ప్రణాళిక రచించినట్లు తెలిసింది. అందులో భాగంగా కొందరు మత పెద్దలతో మాట్లాడి.. శుక్రవారం ఓటర్లకు నచ్చజెప్పేలా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్ సపోర్టుగా మైనార్టీలు..
రాష్ట్రంలో సుమారు 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు క్రియాశీలకంగా ఉంటాయి. ఆ వర్గం ఓట్లు ఎటు పడితే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారారు. ఆ వర్గంలోని ప్రధాన సంఘాలు కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులకు తమ మద్దతు ఉంటుందని జమాతే ఇస్లామి హింద్ అనౌన్స్ చేసింది. అలాగే తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చింది. దీంతో బీఆర్ఎస్ ఎలాగైనా ముస్లిం ఓటర్లకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఎన్ని చేసినా ప్రయోజనం లేకపాయే..
ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నా ఆ వర్గానికి దగ్గర కాలేకపోయామనే ఆవేదన బీఆర్ఎస్ లీడర్లలో ఉన్నది. రంజాన్ తోఫా, విదేశాల్లో చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయం, షాదీ ముబారక్, గురుకులాల ఏర్పాటు, షాదీఖానాలు, ప్రత్యేక శ్మశాన వాటికల నిర్మాణం వంటివి అమలు చేస్తున్నామని గులాబీ లీడర్లు చెబుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10వేల మంది మత పెద్దలకు ప్రతి నెల రూ. 5 వేల గౌరవ వేతనం ఇస్తున్నామని పేర్కొంటున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ఎన్నికల్లో మాత్రం ఆ వర్గం నుంచి సపోర్ట్ రాకపోవడంతో గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని, అయినా ప్రయోజనం లేకుండాపోయిందని ఆవేదన చెందుతున్నారు.
శుక్రవారం కీలకం
ముస్లిం ఓటర్ల మద్దతు కోసం బీఆర్ఎస్ లీడర్లు తీవ్రంగా కష్టపడుతున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం ఇమామ్‌లు, మౌజన్ లను ఆశ్రయించినట్టు టాక్ ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తరువాత రాజకీయ అంశాలపై పిచ్చాపాటిగా చర్చించుకుని, ఏపార్టీకి మద్దతు ఇవ్వాలో అక్కడే సామూహికంగా నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఉన్నది. అయితే ప్రార్థనలు ముగిసిన తరువాత అందరూ బీఆర్ఎస్ కు ఓటు వేసేవిధంగా నచ్చజెప్పే బాధ్యత తీసుకోవాలని ఇమామ్, మౌజన్లకు గులాబీ లీడర్లు బాధ్యత అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందుకోసం ప్రత్యేక బహుమతులు ఇస్తామని ఆశచూపినట్టు టాక్ ఉంది. దీంతో కమ్యూనిటీలో కొందరైనా తమకు ఓటు వేస్తారనే ధీమాలో గులాబీ లీడర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.