ఎస్సీ వర్గీకరణ.. మాదిగ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకేనా?

by GSrikanth |
ఎస్సీ వర్గీకరణ.. మాదిగ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీ ఇచ్చిన హామీపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాన్ని తొమ్మిదిన్నరేండ్లుగా కేంద్రం పట్టించుకోలేదు. కానీ, తాజాగా కమిటీ వేస్తున్నామని, త్వరలోనే కొలిక్కి తెస్తామని ప్రధాని చెప్పినా.. కాలయాపన కోసమే ఈ తతంగమంతా అని అటు మాల, ఇటు మాదిగ సెక్షన్ల ప్రజల్లో అనుమానాలున్నాయి. ఇప్పటికే అనేక కమిషన్ల నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు, అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాలు కేంద్రం దగ్గర ఉండగా.. మరోసారి కమిటీ వేసి తేలుస్తామనడం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దిష్టంగా ఒక సెక్షన్ ఓటర్లను నమ్మించేందుకే ఈ సభ, ప్రధాని హామీ అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీకి ఓటు వేయాలని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఓపెన్‌గా పిలుపు ఇవ్వడాన్ని పరిశీలిస్తే.. ఇది ఎలక్షన్ స్టంట్ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల తర్వాత ఈ అంశం కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోతుందని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ఇరుకున పెట్టడానికి, మాదిగ ఓటు బ్యాంకు వాటివైపు వెళ్లకుండా చూడడానికి.. మోడీ ఈ అంశాన్ని వాడుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

చొరవ తీసుకోని కేంద్ర సర్కార్

మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలతోపాటు విపక్షాలు సైతం ఎన్నికల సందర్భంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ తన 2014 మేనిఫెస్టోలోనే వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చట్టబద్ధత కల్పించలేకపోయింది. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అఖిలపక్షాన్ని, ప్రత్యేక బృందాన్ని ఢిల్లీ తీసుకెళ్లి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సైతం తీర్మానం చేసి పంపింది.

మాలలను తొలగించాలనే డిమాండ్

దళితుల్లో సబ్ గ్రూపులుగా ఉన్న కులాలకు రిజర్వేషన్ల ప్రయోజనాలపై 1965 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం అప్పటి సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీఎన్ లోకూర్ అధ్యక్షతన అడ్వయిజరీ కమిటీని నియమించింది. మూడునెలల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ జాబితాలో ఉన్న కొన్ని కులాలు, తెగలు సాంఘికంగా, ఆర్థికంగా బలపడినందున రిజర్వేషన్ సహా పలు ప్రభుత్వ ఫలాలను అందుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు ఆయా సంఘాల నుంచి కమిటీకి రాతపూర్వకంగా వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మాలలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలన్న డిమాండ్ వచ్చింది. అప్పటి ఎంపీహెచ్‌సీ హెడా సైతం మాల కులాన్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని కమిటీకి వివరించారు. దీనికి కమిటీ నిరాకరించడంతో పలు కారణాలను ఆగస్టు 25, 1965న సమర్పించిన నివేదికలో వివరించింది.

ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం

హక్కుల సాధన కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో 1994 జూలై 7న మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పడిన సంఘం ఆ తర్వాత రాజకీయ పార్టీగా అవతరించింది. మాదిగలకు సైతం రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత లభించాలన్న ఏకైక లక్ష్యంతో ఇప్పటికీ కొట్లాడుతూనే ఉన్నది. జనాభా రీత్యా ఈ సెక్షన్‌ను దూరం చేసుకోకుండా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. హైదరాబాద్‌లో గాంధీ భవన్ కొంతకాలంపాటు మాదిగల దీక్షలకు నిలయంగా మారింది. గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని ఈ డిమాండ్‌ను బలంగా వినిపించాలన్న ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గాంధీ భవన్‌ను ముట్టడించి పెట్రోలు బాంబులు విసరడంతో సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారితో పాటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పలువురు చనిపోయారు.

జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు

ఎస్సీలకు రాజ్యాంగం ద్వారా అందుతున్న రిజర్వేషన్ ఫలాలు ఉప కులాలకు లబ్ధి చేకూరేలా అధ్యయనం చేయాల్సిందిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జస్టిస్ పి.రామచంద్రరాజు అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సమాజంలోని ఆర్థిక, సామాజిక వెనకబాటుతనం, జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ ఫలాలు అందాలని ప్రభుత్వానికి కమిటీ సూచించింది. ఈ సిఫారసులకు అనుగుణంగా 2000-2004 మధ్యకాలంలో వీటి అమలుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా మాలలు కౌంటర్ ఆందోళనను మొదలుపెట్టడంతో ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. చివరకు ఇది సుప్రీంకోర్టుకు చేరింది. ఎస్సీ వర్గీకరణ విధానాలను అమలుచేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగ సవరణలు జరిగిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుందంటూ స్పష్టత ఇచ్చింది.

వర్గీకరణకు ఉషా మెహ్రా కమిషన్

ఎమ్మార్పీఎస్ సహా పలు సంఘాల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా యూపీఏ-1 ప్రభుత్వం జస్టిస్ ఉషా మెహ్రా నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలం పాటు స్టడీ చేసిన ఈ కమిషన్.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)ను ప్రయోగించి రాష్ట్ర ప్రభుత్వమే వర్గీకరణ నిర్ణయం తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయవచ్చని సూచించింది. జనాభా నిష్పత్తి ఆధారంగా వివిధ ఉప కులాలకు రిజర్వేషన్ కోటాను ఫిక్స్ చేయవచ్చని, రాజ్యాంగ చిక్కులు తలెత్తకుండా, న్యాయస్థానాలకు వెళ్లకుండా ఉండేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ కోసం ప్రయత్నించాలని తన నివేదికలో సూచించింది. మాదిగ, రెల్లి, ఆది ఆంధ్ర తదితర ఉప కులాలు ఆర్థికంగా, సామాజికంగా తగిన అవకాశాలు పొందలేకపోతున్నాయని, సబ్ గ్రూపులుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం అమలు చేయవచ్చని పేర్కొన్నది.

తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నవంబరు 29, 2014న తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపినా రాజ్యాంగ సవరణ జరగకపోవడంతో చట్టబద్ధత రాలేదు. ఇదే సమయంలో మంద కృష్ణ మాదిగ ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాత 2016 నవంబరు 27న హైదరాబాద్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ బహిరంగసభకు హాజరైన వెంకయ్యనాయుడు వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, వీలైనంత తొందరగా రాజ్యాంగ సవరణ చేసి ఫలాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సైతం ఢిల్లీకి వెళ్లి వెంకయ్యనాయుడిని కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ఈ అంశంపై చర్చ లేనెత్తారు. అయినా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ దిశగా ప్రక్రియను చేపట్టలేదు.

అసమానతలను సృష్టించిన రిజర్వేషన్ : సుప్రీంకోర్టు

రిజర్వేషన్లతో తగిన ఫలాలు అందడానికి బదులుగా దళితుల్లోనే వివిధ ఉప కులాల మధ్య అసమానతలు తలెత్తాయని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2020లో పంజాబ్ వర్సెస్ దేవీందర్ సింగ్ కేసులో వ్యాఖ్యానించింది. దళితుల్లోని ఉప కులాలన్నింటినీ ఒకే సమూహంగా భావించలేమని పేర్కొన్నది. ఈ ఉప కులాల్లో అత్యంత బలహీనమైనవారికి ప్రాధాన్యత లభించేలా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో సవరణలు చేయాలని ప్రతిపాదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341, 342 ప్రకారం ఈ ప్రక్రియను చేపట్టాలని సూచించింది. పార్లమెంటులో జరిగే ఈ ప్రక్రియ ద్వారా ఎస్సీ, ఎస్టీ జాబితాలపై ఎఫెక్టు పడదని వ్యాఖ్యనించింది. కానీ ఇదే తరహా అంశంపై 2004లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ సాధ్యం కాదని వ్యాఖ్యనించింది.

చిన్నయ్య కేసులో ట్విస్ట్

చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై భిన్నంగా స్పందించింది. ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ అమలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు వ్యతిరేకమని వ్యాఖ్యానించింది. జస్టిస్ రామచంద్రరాజు సిఫారసులను అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిన సమయంలో సుప్రీంకోర్టు‌పై వ్యాఖ్యలు చేసింది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సైతం బీసీలను ఉప కులాలుగా వర్గీకరించే అంశంలో తొమ్మిది మంది జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం.. సమాన స్థాయిలో రిజర్వేషన్ ఫలాలు అందాలంటే బీసీ వర్గీకరణ అవసరమని వ్యాఖ్యానించింది. చిన్నయ్య కేసు విచారణ సందర్భంగా ఇందిరా సాహ్నీ కేసులో రాజ్యాంగ ధర్మాసనం వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేవలం ఓబీసీలకు మాత్రమే వర్తిస్తుందని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కుదరదని తేల్చింది. తమిళనాడు ప్రభుత్వం అరుంధతీయర్లకు రిజర్వేషన్ కల్పించే విషయంలో తీసుకొచ్చిన చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్న లీగల్ చిక్కులు, పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పినందున ప్రదాని మోడీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీని నియమిస్తామని హామీ ఇవ్వడం మరింత జాప్యం జరగడానికే ఆస్కారమిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల తర్వాత ప్రధాని హామీకి రాజకీయ ప్రాధాన్యతే తప్ప కొలిక్కి రావడం అనుమానమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story