నేటితో ముగియనున్న డెడ్‌లైన్.. ఇప్పటికే షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు!

by GSrikanth |
నేటితో ముగియనున్న డెడ్‌లైన్.. ఇప్పటికే షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ సంకేతాలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: షర్మిలను కాంగ్రెస్ లైట్ తీసుకున్నదా? పార్టీ విలీనానికి హస్తం పార్టీ నో చెప్పిందా? కర్ణాటక, ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో వైఎస్సార్టీపీ చీఫ్ జరిపిన సంప్రదింపులు వృథా ప్రయాసగానే మిగిలాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో మొన్నటి వరకు ఇదిగో విలీనం.. అదిగో విలీనం అంటూ లీకులిచ్చిన లోటస్ పాండ్ వర్గీయులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా ఇటీవల లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా విలీనం లేనట్లేననే సంకేతాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. వైఎస్సార్టీపీ విలీనానికి కాంగ్రెస్ వద్దని చెప్పడంలో కాంగ్రెస్ స్టేట్ లీడర్ల పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. హైకమాండ్‌కు పలు నివేదికలు సైతం పంపించినట్లు తెలిసింది. దీనికి తోడు పార్టీలో షర్మిల వన్ మ్యాన్ షో తప్పితే బలమైన క్యాడర్ లేకపోవడం కూడా మైనస్ అయిందని చర్చించుకుంటున్నారు. అయితే విలీనానికి సంబంధించిన ఊహాగానాలకు శనివారంతో తెరపడనున్నది.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో..

కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారాయి. దీంతో ఆ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనానికి షర్మిల ఓకే చెప్పారు. అయితే తెలంగాణ నేతలకు సంబంధం లేకుండా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో విలీనానికి చక్రం తిప్పారు. హైకమాండ్ తోనూ పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అయినా అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు అందలేదు. దీంతో చేసేదేం లేక ఇటీవల షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు. అయినా ఇప్పటి వరకు విలీనంపై స్పష్టత రాకపోవడంతో, షర్మిల డెడ్ లైన్ విధించారు. ఈనెల 30 లోపు తాడో పేడో తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలోనూ షర్మిల నాయకులు, కార్యకర్తలకు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. విలీనం లేకుంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుదామని క్లారిటీ ఇచ్చారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని షర్మిల నాయకులకు స్పష్టం చేసినట్లు సమాచారం.

రాష్ట్ర నేతల నుంచి వ్యతిరేకత

షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీకి నష్టమని రాష్ట్ర నేతలు విలీనాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తున్నది. దీనిపై రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పలు నివేదికలు కూడా పపించినట్లు సమాచారం. మరోవైపు పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల గతంలో ప్రకటించారు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బంది అని భావించిన రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల నాగేశ్వర్ రావును కాంగ్రెస్ లోకి ఆహ్వానించారనే చర్చ జరిగింది. ఇక్కడి నేతలు ఆమెను అడ్డుకోవడంతోనే షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో హైకమాండ్ ను అప్రోచ్ అయినట్లు తెలిసింది. కానీ ఎలాంటి ముందడుగు పడలేదు.

కాంగ్రెస్ షరతులకు ఒప్పుకోకపోవడంతో..

షర్మిలను ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ షర్మిల మాత్రం తెలంగాణ పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ చూపించారు. హస్తం పార్టీ షరతులకు షర్మిల నిరాకరించడానికి తోడు స్థానిక నేతలు వద్దని చెప్పడంతో హైకమాండ్ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఒక్క అంశంలోనే పార్టీ విలీనంపై తాత్సారం జరుగుతున్నదని సమాచారం. కాగా, షర్మిల తాజా వ్యాఖ్యలతో తాను తెలంగాణలో తప్పితే ఏపీలో పని చేయబోననే సంకేతాలు ఇవ్వడంతో విలీనం దాదాపు లేనట్లేననేది స్పష్టమవుతున్నది.

పోటీ సాధ్యమేనా?

షర్మిల 2021లో వైఎస్సార్టీపీని స్థాపించారు. ధర్నాలు, నిరసనలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడారు. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర కూడా చేశారు. అయితే అనుకున్నంత ఆదరణ రాలేదు. కీలక నేతలెవరూ పార్టీలో చేరలేదు. ఉన్న వారు కూడా పార్టీని వీడడం ప్రారంభించారు. ఇందిరా శోభన్ వంటి వారు పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ సన్నిహితులుగా చెప్పుకునే కొండా రాఘవరెడ్డి, బీఆర్ఎస్ నుంచి చేరిన గట్టు రామచంద్రారావులు కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తుంగతుర్తి నుంచి అభ్యర్థిగా ప్రకటించిన ఏపూరి సోమన్న సైతం విలీన వార్తలతో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. విలీనాన్ని చాలా మంది నేతలు సైతం వ్యతిరేకించారు. అయినా వైఎస్సార్టీపీ చీఫ్ కాంగ్రెస్ తో చర్చలు జరిపారు. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌కు ఇచ్చిన సెప్టెంబర్ 30 డెడ్ లైన్ నేటితో ముగియనున్నది. ఒకవేళ విలీనానికి కాంగ్రెస్ నో చెబితే.. వైఎస్సార్టీపీ 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం సాధ్యమేనా అనే చర్చ సాగుతున్నది.

Advertisement

Next Story