అవసరమైతే ఆ గుర్తును తొలగించండి.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు!

by GSrikanth |
అవసరమైతే ఆ గుర్తును తొలగించండి.. ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రోడ్డు రోలర్ గుర్తుపై రెండు పార్టీల మధ్య వార్ జరుగుతున్నది. ‘ఫ్రీ సింబల్స్’ జాబితా నుంచి ఆ గుర్తును తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. గతంలో లిస్టు నుంచి తొలగించినా మళ్లీ రీప్లేస్ చేయడాన్ని తప్పుపట్టింది. యుగతులసి పార్టీకి కామన్ సింబల్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కేటాయిస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఢిల్లీలోని ఈసీకి బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులో పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ పేర్కొన్నారు. యుగతులసి పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడంతోపాటు ఫ్రీ సింబల్స్ జాబితాలో దాన్ని రీప్లేస్ చేయడంపై తమకు అభ్యంతరాలున్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు తమ పార్టీకి కామన్ సింబల్‌గా కేటాయించిన రోడ్డు రోలర్ గుర్తును తొలగిస్తే న్యాయ పోరాటం చేస్తామని యుగతులసి పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్ వ్యాఖ్యానించారు. సింబల్‌తో చికాకు వస్తే టీఆర్ఎస్‌కు కేటాయించిన కారు గుర్తునే మార్చాలని వ్యాఖ్యానించారు.

కారు గుర్తును పోలి ఉండడంతో..

రోడ్డు రోలర్ గుర్తు కారు చిహ్నంతో పోలి ఉన్నదని, ఈవీఎంల బ్యాలట్ పేపర్ మీద ఒకే సైజులో ఉండడంతో గ్రామీణ ఓటర్లు కన్‌ప్యూజ్ అవుతున్నారని, దృష్టిదోషం ఉన్నవారికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈసీకి సమర్పించిన ఫిర్యాదులో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జాతీయ పార్టీలకంటే ఎక్కువ ఓట్లు రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయని కొన్ని ఉదాహరణలను ఉటంకించారు. ఈ సమస్య కారణంగానే గతంలో తాము ఫిర్యాదు చేస్తే 2011 మార్చి నెల నుంచి ఫ్రీ సింబల్స్ లిస్టు నుంచి రోడ్డు రోలర్ గుర్తును తొలగించారని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రత్యక్షమైందని, మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ కంప్లైంట్ చేసిన అంశాన్ని తాజాగా గుర్తుచేశారు.

రోడ్డు రోలర్‌తోపాటు చపాతీ మేకర్, సోప్ బాక్స్, ట్రాక్టర్, ఆటోరిక్షా, టీవీ, కుట్టుమిషన్, షిప్, డోలీ, కెమెరా తదితరాలు కూడ కారు గుర్తుతో ఓటర్లు కన్‌ప్యూజ్ అవుతున్నారని గుర్తుచేశారు. యుగతులసి పార్టీకి కామన్ సింబల్‌గా కేటాయించడం గతంలో ఈసీ జారీ చేసిన ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఆచరణాత్మక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యుగతులసి పార్టీకి కేటాయించిన గుర్తును రద్దు చేయాలని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తగిన ఎంక్వయిరీ చేయాలని తాజా ఫిర్యాదులో బీఆర్ఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. గతంలో తాము చేసిన ఫిర్యాదు మేరకు హ్యాట్ (టోపీ), ఐరన్ బాక్స్ (ఇస్త్రీపెట్టె), ట్రక్, ఆటోరిక్షా గుర్తులను తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చడానికి అనేక గుర్తులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేస్తున్నందునే దానిని పోలి ఉండే గుర్తుల ద్వారా స్వతంత్ర అభ్యర్థులు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆ ఫిర్యాదులో బీఆర్ఎస్ పేర్కొన్నది. రెండు వారాల వ్యవధిలో రోడ్డు రోలర్ గుర్తుపై తాము లేవనెత్తిన అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని తుది ఉత్తర్వులను ఇవ్వాలని బీఆర్ఎస్ కోరింది.

గుర్తు రద్దు చేస్తే న్యాయ పోరాటం

కేంద్ర ఎన్నికల కమిషన్ దాదాపు 190 గుర్తుల్ని ఆరు నెలల క్రితమే ఫ్రీ సింబల్స్ లిస్టులో పెట్టిందని, అప్పుడే బీఆర్ఎస్ స్పందించి ఉండాల్సిందని యుగతులసి పార్టీ నేత శివకుమార్ వ్యాఖ్యానించారు. తాజా ఉత్తర్వులతో యుగతులసి పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు రోలర్ కామన్ సింబల్‌గా దక్కిందని, ఇప్పుడు దాన్ని రద్దు చేయడమో లేక తొలగించడమో చేస్తే ఒప్పుకోబోమన్నారు. అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు. ఈవీఎంల దగ్గర బ్యాలెట్ పేపర్ దగ్గర గుర్తుతోపాటు అభ్యర్థి ఫోటో కూడా ఉంటుందని, ఓటర్లు కన్‌ఫ్యూజన్‌కు గురయ్యే అవకాశమే లేదన్నారు.

కంటి వెలుగుతో వృద్ధుల కంటి సమస్యలకు పరిష్కారం కనుగొన్నామని చెప్తున్న అధికార పార్టీ నేతలు ఓట్ల సమయంలో గుర్తుల దగ్గర తికమక పడుతున్నారనే వాదనను తీసుకురావడం అర్థరహితమన్నారు. పార్టీ గుర్తుతోనే బీఆర్ఎస్‌కు నష్టం జరుగుతున్నట్లు భావిస్తే ఆ పార్టీ గుర్తునే మార్చుకోవచ్చు గదా అని ప్రశ్నించారు. పార్టీ పేరు మారినప్పుడు గుర్తు కూడా మారాలన్న వాదనను తెరపైకి తెచ్చారు. మునుగోడు ఉప ఎన్నికలో తమకు కేటాయించిన గుర్తును బీఆర్ఎస్ ఒత్తిడి ప్రయోగించి రద్దు చేయించుకున్నదని, ఈ కారణంగా రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్ రిటర్నింగ్ అధికారి సస్పెన్షన్ గురయ్యారని శివకుమార్ గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed