ఆ జిల్లాలో సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ వెనకడుగు?

by GSrikanth |
ఆ జిల్లాలో సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ వెనకడుగు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 16న వరంగల్ బహిరంగ సభ నిర్వహణపై బీఆర్ఎస్ పార్టీలో అయోమయం కొనసాగుతున్నది. ముందుగా ప్రకటించిన మేరకు అదే రోజున సభ నిర్వహించాలా? లేక మరో డేట్ ఫిక్స్ చేయాలా? అని మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ 16న సభ నిర్వహిస్తే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు వస్తారా? అనే అనుమానం గులాబీ పెద్దలకు పట్టుకుందని, అందుకే ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇంతవరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు సభ ఏర్పాట్లపై ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

క్లారిటీ లేదంటున్న ఎమ్మెల్యేలు..

ఆగస్టు 21న అభ్యర్థులను ప్రకటించిన తరువాత సీఎం కేసీఆర్ వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల శంఖారావాన్ని వరంగల్ వేదిక నుంచి పూరించాలనుకున్నారు. సభకు సుమారు 10 లక్షల మంది జనాలను రప్పించి, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించాలని భావించారు. కానీ ఇంతవరకు సభ నిర్వహణపై ఆ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను అలర్ట్ చేయలేదు. సభ ఉన్నదీ.. లేనిదీ క్లారిటీ ఇవ్వలేదని తెలిసింది. ‘ఎన్నికల ముందు నిర్వహించే సభను భారీ ఎత్తున నిర్వహించాలి. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టాలి. కాని ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సభ ఉంటే కేసీఆర్ ఇప్పటికే హడావుడి చేసేవారు.’ అని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వివరించారు.

వ్యతిరేకత వల్లే సభా వాయిదా?

ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్టు టాక్ ఉంది. అందుకు ప్రధాన కారణం ఇప్పటివరకు పలు స్కీమ్‌లను అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టడమనే అభిప్రాయాలు ఉన్నాయి. దళిత బంధు, గృహలక్ష్మి, బీసీ, మైనార్టీ సాయానికి ఎమ్మెల్యేలు లబ్ధిదారుల జాబితాను రెడీ చేసి పెట్టారే కాని నిధులు ఇవ్వలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ పూర్తి చేయలేదు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగి, ప్రచారానికి ఎమ్మెల్యేలు వెళ్తుంటే నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మీటింగ్ పెట్టడం వల్ల ప్రజల నుంచి మరింత వ్యతిరేకత వస్తుందన్న భయంలో పార్టీ పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

షెడ్యూలు తరువాత జిల్లాల్లో సభలు..

ఈనెల 10వ తేదీలోపు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే చాన్స్ ఉందన్న చర్చ నడుస్తోంది. ఆ తరువాతే బీఆర్ఎస్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్థాయి సభలు నిర్వహించడం వల్ల సమయం ఎక్కువ తీసుకోవడం, జన సమీకరణ పెద్ద సమస్యగా ఉంటుందని, అందుకని జిల్లాలవారీగా సభలు ఈజీ అవుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. రోజుకు రెండు మూడు జిల్లాల్లో పాల్గొనే విధంగా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూలు తయారు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.


Next Story

Most Viewed