జెడ్పీటీసీ టు చీఫ్ మినిస్టర్.. KCRకు ఎదురెళ్లిన రేవంత్ ప్రస్థానం ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-06 04:22:25.0  )
జెడ్పీటీసీ టు చీఫ్ మినిస్టర్.. KCRకు ఎదురెళ్లిన రేవంత్ ప్రస్థానం ఇదే..!
X

దిశ బ్యూరో/ మహబూబ్ నగర్/ రంగారెడ్డి : రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించి విజయాన్ని సాధించేది కొందరే.. ఆ కొందరిలో రేవంత్ రెడ్డి ఒకరు. అలా దాటుకుంటూనే ఆయన నాడు జెడ్పీటీసీ నుంచి నేడు సీఎం పదవిని చేపట్టబోతున్నారు. చిన్నతనం నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో డిగ్రీ చదివే నాటి నుంచి విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేస్తూ పలువురు రాజకీయ నాయకులతో అనుబంధాలను పెంచుకున్నారు.

మొదట్లో బీజేపీ సానుభూతిపరుడుగా ఉంటూ 2003లో అప్పటి టీఆర్ఎస్‌లో చేరాడు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఆ తర్వాత 2006లో మిత్రుల సలహాలు సూచనలతో మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి అప్పటికే రాజకీయ రంగంలో ఉద్దండునిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి రబ్బానిపై 1350 కు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలిచాడు.

స్వతంత్ర అభ్యర్థిగా...

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో రేవంత్ రెడ్డి పేరు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా మారు మోగింది. ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం టీడీపీలో చేరారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే నందారం సూర్యనారాయణ దివంగతులు కావడంతో అధినేత చంద్రబాబు నాయుడు, ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని కోరడంతో బరిలో నిలిచి కాంగ్రెస్ సీనియర్ నేత గుర్నాథ్ రెడ్డిని మొదటి ప్రయత్నంలోనే ఓడించాడు.

2014లోనూ గెలిచిన ఆయన టీటీడీపీ ప్రెసిడెంట్‌గానూ పని చేశారు. అనంతరం అప్పటి పరిస్థితుల కారణంగా 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. 2018 ఎన్నికల్లో అధాకార పక్షం రేవంత్ ఓటమికి శాయశక్తులా పని చేయడంతో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందారు. 2021లో టీపీసీసీ చీఫ్‌గా నియమితులయ్యారు.

కేసీఆర్‌కు దీటుగా ఒకే ఒక్కడు..

సీఎం కేసీఆర్, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పని చేశారు. తమదైన శైలిలో పనిచేసి పార్టీని అధికారంలోకి తేవడంతో కీలక పాత్ర పోషించారు. సొంత జిల్లాలోని నాలుగు స్థానాలు గెలిపించుకున్నాడు. కేసీఆర్‌పై పోరాడే ఏకైక వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ​

Also Read: నేడు ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి కీలక భేటీ!

Advertisement

Next Story

Most Viewed