ఆర్ఎస్ఎస్ మద్దతు వద్దని మోడీ ఎందుకు చెప్పడం లేదు: ఖర్గే

by Prasad Jukanti |
ఆర్ఎస్ఎస్ మద్దతు వద్దని మోడీ ఎందుకు చెప్పడం లేదు: ఖర్గే
X

దిశ, డైనమిక్ బ్యూరో:జూన్ 4వ తేదీన కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. నాలుగో విడత ఎన్నికల తర్వాత ఇండియా కూటమి మరింత బలోపేతంగా ఉందని దేశ ప్రజలు మోడీకి వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. బుధవారం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో కలిసి లక్నోలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఖర్గే.. ఈ ఎన్నికలు చాలా కీలకమైననవి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఇదో మంచి అవకాశం అన్నారు. మనమందరం కలిసి దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోకుంటే మళ్లీ బానిసలుగా మారతామని, ప్రజాస్వామ్యం కాకుండా నిరంకుశత్వం, నియంతృత్వం వస్తుందన్నారు. మోడీని గద్దెదింపేందుకు పేదల తరపున మేం తరపున పోరాడుతున్నామని ప్రజల మద్దతు మాకే ఉందన్నారు. 26 పార్టీలు ఏకమై పని చేయడం తన రాజకీయ జీవితంలో చూడలేదని ఇన్ని పార్టీలు కలిసి పని చేస్తున్నాయంటే మోడీపై దేశంలో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం అవుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కాపాడటం మా బాధ్యత అన్నారు. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ కేంద్రంలో మహిళ ఓటర్ బుర్కా తొలగించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం అవుతుందా? మా ఎన్నికల ఏజెంట్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఆర్ఎస్ఎస్ మద్దతు వద్దని ఎందుకు చెప్పడం లేదు?:

బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడారని, 2/3 మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చుతామని మరో బీజేపీ నేత చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించేందుకు మోడీ ఎందుకు భయపడుతున్నారని ఖర్గే ప్రశ్నించారు. ఒక వేళ ఆర్ఎస్ఎస్ వ్యక్తులే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ మద్దతు మాకు వద్దు అని మోడీ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రాజ్యాంగంపై వారు చేస్తున్న వ్యాఖ్యలు దేశ ద్రోహంకు సంబంధించినవన్నారు. మణిపూర్ అంశంపై మోడీ ఎక్కడా మాట్లాడకుండా మటన్, మఘల్, మంగళ సూత్రం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చేసిన పనులు చెప్పి ఓట్లు అడగాలన్నారు. నెహ్రూ ఈ దేశంలో అనేక పరిశ్రమలు స్థాపించారన్నారు. కులగణన చేస్తామని తాము చెబుతుంటే మీ సంపదను లాక్కుని వాటిని ముస్లింలకు పంచిపెడతామని మోడీ అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇంత అబ్దదాల కోరును తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఇండియా కూటమి బలంగా ఉందని.. తాము ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామన్నారు. 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నామని మోడీ చెబుతున్నారు, కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకు వచ్చిందే యూపీఏ ప్రభుత్వం అన్నారు.

Advertisement

Next Story