ఎందుకు ఓడారు?.. గాంధీ‌భవన్‌లో అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ

by Prasad Jukanti |   ( Updated:2024-07-11 07:28:41.0  )
ఎందుకు ఓడారు?.. గాంధీ‌భవన్‌లో అభ్యర్థులతో కురియన్ కమిటీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడంపై ఏఐసీసీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఇవాళ గాంధీభవన్‌కు చేరుకుంది. పార్టీ సీనియర్ నేత కురియన్ నేతృత్వంలోని ఏర్పాటైన ఈ త్రిసభ్య కమిటీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులతో వేర్వేరుగా భేటీ అవుతున్నది. ఒక్కో అభ్యర్థితో 30 నిమిషాల పాటు సమావేశమై వారి ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తున్నది. ఇందులో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ తొలుత కమిటీ ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్‌నగర్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థులతో భేటీ కానున్నారు. లంచ్ అనంతరం సాయంత్రం 7 గంటల వరకు మిగిలిన వారితో సమావేశమై ఓటమికి దారి తీసిన పరిస్థితులను కమిటీ సభ్యులు తెలుసుకోనున్నారు.

తొమ్మిదిమంది ఓటమి..

లోక్‌సభ ఎన్నికల్లో 14 స్థానాలు టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణ, కరీంనగర్‌లో వెలిచాల రాజేందర్‌రావు, నిజామాబాద్‌లో టి.జీవన్‌రెడ్డి, మెదక్‌లో నీలం మధు, మల్కాజిగిరిలో పట్నం సునీతమహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్, చేవెళ్లలో గడ్డం రంజిత్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో చల్లా వంశీచంద్‌రెడ్డి, హైదరాబాద్‌లో మహ్మద్ సమీర్‌ ఓటమి పాలయ్యారు. వీరిలో తప్పక గెలుస్తారనుకున్న రెండు మూడు స్థానాల్లో పార్టీ బోల్తా కొట్టడం హస్తం పార్టీని షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించేందుకు అధిష్టానం కురియన్‌తో పాటు రకీబుల్, హుస్సేన్, పర్గత్ సింగ్‌లతో కూటిన త్రిసభ్య కమిటీని నియమిచింది.

పొరపాట్లు వివరించా : దానం

సికింద్రాబాద్ స్థానంలో తప్పక గెలవాల్సి ఉన్నప్పటికీ కొన్ని పొరపాట్ల వల్ల పార్టీ ఓటమి పాలైందని ఈ విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకువెళ్లినట్లు దానం నాగేందర్ చెప్పారు. కమిటీ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పొరపాట్లను సరిదిద్దుకునేందుకు, అభ్యర్థులలో ఆత్మవిశ్వాసం, మనోధైర్యం కల్పించేందుకు ఇలాంటి సమీక్ష ఉపయోగపడుతుందన్నారు.

Advertisement

Next Story