బీజేపీ ఎల్పీ నేత ఎవరు.. రేసులో ఉన్నది ఎవరంటే..?

by Sathputhe Rajesh |
బీజేపీ ఎల్పీ నేత ఎవరు.. రేసులో ఉన్నది ఎవరంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందింది. అయితే శాసనసభలో బీజేపీ ఎల్పీ నేతగా ఎవరిని నియమిస్తారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే రేసులో మాత్రం ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలలో ఎవరిని నియమిస్తే బాగుంటుందనే అంశంపై రాష్ట్ర నాయత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

హ్యాట్రిక్ ఎమ్మెల్యేకేనా..?

బీజేపీలో సీనియారిటీ ప్రకారం చూస్తే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. గతంలోనూ ఆయనకు శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. రాజాసింగ్‌ను నియమిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కాషాయ పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల రాజాసింగ్ ఇంటికి కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెళ్లి కలవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎల్పీ నేతగా రాజాసింగ్ నియామకం నేపథ్యంలోనే కలిశారని కొందరు చెబుతుండగా ఇంకొందరు ఆయనకు కాకుండా మరో నేతకు ఇచ్చే నేపథ్యంలో ముందే బుజ్జగించేందుకు వెళ్లినట్లు చర్చించుకుంటున్నారు.

‘కాటిపల్లి’కీ చాన్స్..?

మరోవైపు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి డబుల్ జెయింట్ కిల్లర్‌గా రికార్డు సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ సైతం బీజేపీ శ్రేణుల్లో జరుగుతోంది. సభలో ఆయనతో మాట్లాడించడంతో పాటు ప్రజా సమస్యలపై నిలదీసే అవకాశాన్ని ఆయనకిస్తే బాగుంటుందని పలువురు రాష్ట్ర నాయకత్వానికి సూచనలు చేసినట్లు టాక్. అలాగే నిర్మల్ నుంచి పోటీ చేసి గెలుపొందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం బీజేపీ ఎల్పీ లీడర్‌గా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీ పెద్దలకు టచ్ లో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఎవరికిస్తారనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed