ఏ సంకీర్ణంలో చేరుతావు.. KCRకు CM రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-04 08:06:59.0  )
ఏ సంకీర్ణంలో చేరుతావు.. KCRకు CM రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం స్థానం నుంచి నామా గెలిస్తే సంకీర్ణంలో కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నారని.. కేంద్రంలోని ఏ సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్ చేరతారని సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కొత్తగూడెంలో ఎంపీ అభ్యర్థులు రఘురామిరెడ్డి, బలరాం నాయక్‌లకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ బీజేపీలో చేరతారని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకూ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. నమ్మించి మోసం చేయడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరన్నారు. డిసెంబర్ 3న వచ్చినవి సెమీఫైనల్ ఫలితాలు మాత్రమే అని.. ఈ నెల 13న జరిగే ఫైనల్స్‌లో తమదే విజయం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందానమని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని.. అత్యధిక మెజార్టీతో గెలిచే స్థానంగా ఖమ్మం నిలుస్తోందని కాంక్షించారు.

పోరాటాల గడ్డగా ఖమ్మం జిల్లాకు పేరుందని.. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచే మొదలైందన్నారు. ఖమ్మం ప్రజలు ప్రారంభించిన పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. నక్కజిత్తుల కేసీఆర్ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజలు ముందే పసిగట్టారని తెలిపారు. అందుకే 2014, 2019, 2023లో బీఆర్ఎస్‌ను దూరం పెట్టారని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్య వంతులు.. ముందు చూపు ఎక్కువ అన్నారు. రాబోయే మార్పులు.. జరగబోయే పరిణామాలను ఖమ్మం ప్రజలు ఊహిస్తారని సీఎం రేవంత్ అన్నారు. పదేళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది బీజేపీయే అన్నారు. తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిన బీజేపీని కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. రూ.7లక్షల అప్పుతో రాష్ట్రాన్ని మాకు అప్పగించారని.. ఖమ్మంలో రఘురామిరెడ్డి, మహబూబాబాద్‌లో బలరాం నాయక్ గెలవాలన్నారు.

Advertisement

Next Story