Modi caste: ఇంతకూ మోడీది ఏ కులం?.. గూగుల్‌లో తెగ సెర్చింగ్!

by Prasad Jukanti |   ( Updated:2025-02-15 08:02:11.0  )
Modi caste: ఇంతకూ మోడీది ఏ కులం?.. గూగుల్‌లో తెగ సెర్చింగ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో క్యాస్ట్ పాలిటిక్స్ రచ్చ రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) కులంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ (BJP) మధ్య డైలాగ్ పంచ్‌లు పేలుతున్నాయి. రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే చర్చలోకి అనూహ్యంగా రేవంత్ ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని తీసుకురావడంతో డిబేట్ పూర్తిగా కొత్త మలుపు తీసుకుంది. నరేంద్ర మోడీ పుట్టుకతో బీసీ కాదని ఆయన కన్వర్టెట్ బీసీ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంటుంటే, కాంగ్రెస్ (Congress) సైతం అంతే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది. రాష్ట్రంలోని కులగణన సర్వేపై విమర్శలు, ప్రతివిమర్శలతో సాగిన వార్ ఇప్పుడు నరేంద్ర మోడీ క్యాస్ట్ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో మోడీ కులం ఏంటి? రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా 2001 సంవత్సరంలో అసలేం జరిగింది? అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

అసలేంటి మోడీ కులం వివాదం..

నరేంద్ర మోడీ ‘తెలి’ కులానికి (Modis caste) చెందిన వ్యక్తి. ఆ కులంలో చాలా ఉపకులాలు ఉన్నాయి. అందులో ఒకటైన మోధ్‌-ఘాంచి కులానికి చెందినవారు మోడీ. ఎడిబుల్ ఆయిల్‌ సహా ఇతర వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్లు. అయితే 1999 అక్టోబర్ లో వాజ్ పెయి ప్రభుత్వం ఓబీసీ జాబితాలో 23వ ఎంట్రీలో ‘ఘాంచి (ముస్లిం), తెలి, మోధ్ ఘాంచి, తెలి-సాహు, తెలి-రాథోడ్, తెలి-రాథోర్’ కులాలను చేర్చగా, గుజరాత్ ప్రభుత్వం 2000 ఏప్రిల్ 4న ‘తెలి’, ‘మోధ్ ఘాంచి’, ‘తెలి సాహు’, ‘తెలి రాథోడ్’ ‘తెలి రాథోర్‌’ కులాలను బీసీల జాబితాలో చేర్చింది. అయితే అప్పటి వరకు దీన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ మోడీ గుజరాత్‌ సీఎం అయిన తర్వాత అంటే 2002 తర్వాత ఘాంచి/తెలి కులం గురించి ఆరా తీయడం ఎక్కువైంది. అందుకే కొన్నిచోట్ల ఈ ఘాంచి కులాన్ని 2000లో బీసీల్లో చేర్చారని మరికొన్నిచోట్ల 2002 అని ప్రస్తావిస్తున్నారు. కానీ అధికారికంగా చూస్తే 2000లోనే ప్రక్రియ పూర్తి అయింది.

గతంలోనే జాతీయ స్థాయిలో చర్చ..

నరేంద్ర మోడీ కులం విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తొలిసారి తెలంగాణలో చర్చ జరుగుతున్నా, నిజానికి ఈ అంశం జాతీయ స్థాయిలో చాలాకాలంగా వినిపిస్తున్నదే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీఎస్పీ చీఫ్ మాయావతి (Mayawati) వంటి జాతీయ స్థాయి నేతలు మోడీ పుట్టుకతోనే ఓబీసీకి చెందిన వ్యక్తి కాదు అంటూ కామెంట్స్ చేశారు. రేవంత్ సైతం పుట్టుకతోనే మోడీ బీసీ కులాలకు చెందిన వ్యక్తి కాదంటూ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు రాహుల్ గాంధీ కులం ఏంటంటూ? ఎదురుదాడి చేస్తున్నారు. మొత్తంగా చాలాకాలంగా చర్చ జరుగుతున్న మోడీ కులం ప్రస్తావన రేవంత్ వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.



Next Story

Most Viewed