పార్టీ మారే ఎమ్మెల్యేల అక్రమాలను బయటపెడతాం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

by Shiva |
పార్టీ మారే ఎమ్మెల్యేల అక్రమాలను బయటపెడతాం: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: అక్రమాలు చేయడానికే కొందరు, అక్రమాలను సక్రమం చేసుకోవడానికి మరికొందరు అధికార పార్టీలోకి వెళ్తున్నారని, వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీయే బయట పెడుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వారి అక్రమాలను ప్రతిపక్షంలో ఉండి చీల్చి చెండాడుతాం అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వార్ధపరులు పార్టీ మారుతున్నారని దుయ్యబట్టారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి వెళ్తున్న నేతలను ప్రజలే ఛీ కొడుతరు, చెప్పులతో కొడుతారని అన్నారు. పార్టీ మారి అక్రమాలు చేస్తే ప్రజలతో చెప్పులతో కొట్టిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొంతమందిని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తూ పార్టీల్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఒక పార్టీ లో ఎన్నికైన వారు రాజీనామా చేయకుండా ఎలా పార్టీ మారుతున్నారని ప్రశ్నించారు. ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

ఆకాల వర్షాలు, వడగండ్ల వనతో 2లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్టం తీవ్రతపై అంచనా వేయలేదని, కనీసం రైతులను పరామర్శించలేదన్నారు. 40ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వేయలేదనని, బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే పంట నష్టపోయిన ప్రతి ఎకరాకు రైతుల అకౌంట్స్ లో 10వేలు వేయాలని డిమాండ్ చేశారు.

రైతులను ముంచకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ది ఉంటే వెంటనే 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. మంచినీళ్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సరఫరా చేసిందని, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది.. ఎందుకు సాగు, తాగునీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ నేత రూప్ సింగ్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed