Warangal : ఓరుగ‌ల్లుకు నిరాశే.. రాష్ట్ర బ‌డ్జెట్‌లో ద‌క్కని ప్రియారిటీ

by Aamani |
Warangal : ఓరుగ‌ల్లుకు నిరాశే.. రాష్ట్ర బ‌డ్జెట్‌లో ద‌క్కని ప్రియారిటీ
X

దిశ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో త‌ర్వాత తొలిసారిగా రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బ‌డ్జెట్‌ను గురువారం ప్రవేశ‌పెట్టింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రూ.2,91,159 కోట్ల భారీ బ‌డ్జెట్‌లో వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక నిధుల కేటాయింపులు ల‌భించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శలు వ్యక్తమ‌వుతున్నాయి. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు సరిగా జరగలేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు, పార్లమెంట‌రీ ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అనేక అంశాల‌పై హామీల వ‌ర్షం కురిపించారు. ముఖ్యంగా వ‌రంగ‌ల్ ప‌ట్టణాభివృద్ధికి వంద‌ల కోట్ల నిధుల‌ను స‌మ‌కూర్చుతామ‌ని చెప్పారు. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి చ‌ర్యలు తీసుకుంటామ‌ని, అందుకు సంబంధించిన ప్రతిపాద‌న‌లు ఇవ్వాల‌ని కూడా ఆదేశించారు. త‌ద‌నుగుణంగా ఆయా శాఖ‌ల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డీపీఆర్‌లు వెళ్లాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ‌పెట్టబోయే తొలిప‌ద్దులో వ‌రంగ‌ల్ జిల్లాకు ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని అంతా భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం వ‌రంగ‌ల్ జిల్లాను ప‌ట్టించుకోలేద‌ని స్పష్టమ‌వుతోంది.

అంచ‌నాలు తారు మారు..!

ఎంజీఎం సూప‌ర్ స్పెషాలిటీ నిధుల కేటాయింపు జ‌ర‌గ‌లేదు. కాక‌తీయ వ‌ర్సిటీని గాడిన పెట్టేందుకు ప్రత్యేక నిధి ఉంటుంద‌ని ఆశించినా అదీ జ‌ర‌గ‌లేదు. వ‌రంగ‌ల్ కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ‌తంలో భారీగా నిధులు విడ‌దుల చేస్తామ‌ని వెల్లడించింది. కొద్దిరోజుల క్రితం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స‌మీక్ష నిర్వహించ‌డంతో ఈ సారి నిధుల కేటాయింపు త‌ప్పకుండా జ‌రుగుతుంద‌ని జిల్లా ఎమ్మెల్యేలు కూడా ఘంటాప‌థంగా చెప్పారు. కానీ దానికి నిరాశే మిగిలింది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు రూ.100 కోట్ల వ‌ర‌కు పెండింగ్ బ‌కాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త వ‌ర్క్‌ల‌కు కేటాయింపులు జ‌ర‌గాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం క‌రుణించ‌లేదు. కాక‌తీయ అర్బన్‌డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి సైతం భారీగా నిధులు ద‌క్కుతాయ‌ని అంతా అనుకున్నారు.

హెచ్ ఎండీఏపై నిధులు భారీగా కేటాయించ‌గా, వ‌రంగ‌ల్ కుడాపై మాత్రం ప్రభుత్వం శీత‌క‌న్ను ప్రద‌ర్శించింద‌న్న విమ‌ర్శలు ఇప్పుడు జ‌నం నుంచి వినిపిస్తున్నాయి. స్మార్ట్‌సిటీ, నియోమెట్రో ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత నివ్వలేదు. విద్య, వైద్యం, పారిశ్రామిక‌, టూరిజం, నీటిపారుద‌ల‌, మున్సిపాలిటీ, ఐటీ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప‌ద్దులో ప్రత్యేక కేటాయింపు జ‌రుగుతాయ‌ని ఓరుగ‌ల్లు వాసులు ఆశించారు. వాస్తవంలో ఏ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం క‌రుణ చూప‌క‌పోవ‌డంతో స‌ర్వత్రా నిరాశ వ్యక్తమ‌వుతోంది. కేవ‌లం రాష్ట్ర యూనిట్‌గా అమ‌ల‌య్యే ప‌థ‌కాల ద్వారా మాత్రమే ల‌బ్ధిదారుల‌కు ప్రయోజ‌నం ఒన‌గూర‌నుంది. వ‌రంగ‌ల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5ల‌క్షల పైచిలుకు రైతులు ఉన్నారు. వ్యవ‌సాయానికి పెద్ద ప‌ద్దునే కేటాయింపు చేయ‌డంతో వీరంద‌రికీ కొంత ప్రయోజ‌నం జ‌రిగే అవ‌కాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed