మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్

by Kalyani |
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్
X

దిశ, జనగామ: జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఈ సమావేశం తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. అలాగే మాదకద్రవ్యాలను ఎవరైనా వినియోగించినట్లైతే, వారి సమాచారాన్ని తెలిపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో పనిచేసే సిబ్బంది, ఆ పరిసరాల్లో ఉండే షాపు యజమానులు, వర్కర్లతో సమావేశాలను ఏర్పాటు చేసి, అవగాహన కల్పించాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో, ప్రధాన కూడళ్లలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను తెలియజేసే ఫ్లైక్సీ లను ఏర్పాటు చేయాలన్నారు.

బార్లు, రెస్టారెంట్ ల సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టి, అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్లను అందుబాటులో ఉంచుకోవాలని సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మాదక ద్రవ్యాల రవాణా, వాడకాన్ని నివారించేందుకు గాను వివిధ వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మాదకద్రవ్యాలను రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనుమానిత ప్రాంతాల వద్ద పోలీస్ యంత్రాంగం గట్టి నిఘా పెట్టాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని, తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకోవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో వైద్య శాఖ ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్ గౌడ్, జిల్లా ఎక్సైజ్ సీఐ ప్రభావతి, జనగామ ఏసిపి పార్థసారథి, ఘనపూర్ (స్టేషన్) ఏసిపి భీం శర్మ, వర్ధన్నపేట ఏసీపీ నర్సయ్య, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed