నిజాం సర్కార్ గుండెల్లో సింహా స్వప్నం కొమరం భీమ్: MLA సీతక్క

by Satheesh |   ( Updated:2022-12-26 14:27:40.0  )
నిజాం సర్కార్ గుండెల్లో సింహా స్వప్నం కొమరం భీమ్: MLA సీతక్క
X

దిశ, గార్ల: నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీమ్ అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో సోమవారం కొమరం భీమ్ విగ్రహాన్ని సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అడవిని జీవనోపాధిగా చేసుకొన్న కొమరం భీమ్ నిజాంలను ఎదురించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడన్నారు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని.. జల్ జంగల్ జమీన్(భూమి,అడవి,నీరు మాదే) అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని కొనియాడారు. కొమరం భీమ్ ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. ఆదిలాబాద్ అడవుల్లో భీం పోరాటం జరిగి నేటికి డభ్భై రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నదని తెలిపారు. బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా బిర్సాముండా, సంతాల్లు, తిరుగుబాటు చేశారన్నారు. ఆదివాసీల క్షేమం కోసం చివరి వరకు పోరాడని గొప్ప యోధుడని ప్రశంసించారు.

తమ అస్తిత్వం కోసం ఆదివాసీలు నేటికీ అలుపెరుగని పోరాటాలు చేస్తున్నారన్నారు. అయినప్పటికీ ఆదివాసీ భూరక్షణ చట్టం 1/70 అమలు చేయడం లేదని వాపోయారు. ఆదిలాబాద్‌లో నివసిస్తు్న్న గోండు తెగకు సంబంధించిన ప్రధాన్, తోటి, మన్నె, కోయ తెగలే కాకుండా నాయక్ పోడ్, ఆంధ్ ఇతర ఆదివాసీ తెగలు ప్రస్తుతం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబేఝురి లోద్దుల్లో పన్నెండు గూడేలపై రాజ్యాధికారం కోసం తుడుం మోగించిన కొమురం భీం వారసత్వం నేటికీ దండకారణ్యంలో కొనసాగుతున్నదని అన్నారు.

కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సలిపిన గార్లగడ్డపై కొమరం భీమ్ స్ఫూర్తిదాయక ఉద్యమ పోరాటాలకు చిహ్నం కొమరం భీమ్ విగ్రహం ఆవిష్కరణ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, ఆదివాసి రాష్ట్ర మహిళా సంఘం నాయకురాలు అరుణ, ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీ నాగమణి, సర్పంచులు జానకిరాణి, బాబురావు, కోరం కళ, మండల ప్రధాన కార్యదర్శి మోకాళ్ళ శ్రీను, రామకృష్ణ సత్యనారాయణ, రాము దొర, ఆదివాస ప్రజలు, సీతక్క అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story