2వేల నోటు మార్పిడికి కంగారు ప‌డ‌ని జ‌నం.. సాధ‌ర‌ణంగానే బ్యాంకుల వ‌ద్ద ర‌ద్దీ

by Mahesh |
2వేల నోటు మార్పిడికి కంగారు ప‌డ‌ని జ‌నం.. సాధ‌ర‌ణంగానే బ్యాంకుల వ‌ద్ద ర‌ద్దీ
X

దిశ‌, వ‌రంగ‌ల్ నెట్వర్క్ : రూ.2వేల నోటు ర‌ద్దు చేస్తూ.. మార్పిడి చేసుకునేందుక సెప్టెబ‌ర్ 3 వ‌ర‌కు గ‌డువు ఇచ్చిన విష‌యం తెలిసిందే. మార్పిడి ప్రక్రియ మంగ‌ళ‌వారం నుంచి ఆరంభం కాగా.. ముందుగా ఊహాగానాలు వినిపించినంత ప్రభావ‌మేమి బ్యాంకుల్లో క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. బ్యాంకుల వ‌ద్ద క్యూలు ఏర్పడ‌తాయ‌ని కొన్ని విశ్లేష‌ణ‌లు జ‌రిగినా.. బ్యాంకుల్లో కార్యక‌లాపాలు మాత్రం చాలా సాదాసీదాగా... ఎప్పటిలాగే మాములుగా ఖాతాదారుల ర‌ద్దీతోనే క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా వ్యాప్తంగా ప‌లు బ్యాంకుల‌ను వ‌రంగ‌ల్ దిశ నెట్వర్క్ టీం సంద‌ర్శించింది. రూ.100, 500 నోట్లు చెలామ‌ణి ఉండ‌టంతో పెద్దగా ప్రభావం ఉండ‌టం లేద‌ని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రూ.2000 నోటు కేవ‌లం ఎగువ మ‌ధ్యత‌ర‌గ‌తి, వ్యాపార‌, ఇత‌ర సంప‌న్న వ‌ర్గాల వారి వ‌ద్దనే నిల్వ ఉంద‌ని, మార్పిడికి సుదీర్ఘమైన కాల వ్యవ‌ధి వెసులుబాటు ఉండ‌టం కూడా తొలిరోజే బ్యాంకుల‌కు రాక‌పోవ‌డానికి ప్రధాన కార‌ణంగా విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా రూ. 2వేల నోటును మాత్రం వ్యాపార కార్యక‌లాపాల్లో పూర్తిగా నిలిచిపోయిన సంఘ‌ట‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల్లో రూ.2వేల నోటును ఎవ‌రూ తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఐటీ ప‌డుతుంద‌ని భావిస్తున్న కొంత‌మంది బంగారు ఆభ‌ర‌ణాల కొనుగోలుకు ఎక్కువ మంది రూ.2వేల నోటును వినియోగిస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతున్నా.. వ‌రంగ‌ల్‌లోని న‌గ‌ల వ్యాపారుల మాత్రం ఇక్కడ ఆ పరిస్థితులు లేవ‌ని వెల్లడిస్తున్నారు.

హన్మకొండ జిల్లా కేంద్రంలోని బ్యాంకుల్లో రెండు వేల నోట్లు జమ కాలేదు. బంగారం షాప్‌లు ఉన్న సి.పి.రెడ్డి కాంప్లెక్స్ లో పెద్ద నోటును కొనుగోలు దారులు తేలేద‌ని షాపుల నిర్వాహాకులు వెల్ల‌డించారు. వ‌రంగ‌ల్ జిల్లా కేంద్రంలోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో బ్యాంకుల వద్ద 2కె నోట్ల మార్పిడి ఎలాంటి రద్దీ క‌నిపించ‌లేదు. వ‌రంగ‌ల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో రూ. 2వేల నోట్లు మార్చుకునేందుకు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు ఎవ‌రూ రాలేద‌ని బ్యాంకు అధికారులు తెలిపారు.

మహముత్తరాం మండల కేంద్రంలో‌ని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఇప్పటి వరకు ఒక్కరు కూడా 2000 నోట్లు మార్చలేదు. కాటారం స్టేట్ బ్యాంకులో మామూలుగా రద్దీ ఉండగా, యూనియన్ బ్యాంకులో అసలు కస్టమర్లే లేరు. ఎస్బిఐ లో ఇప్పటి వరకు సుమారు 20 లక్షల రూపాయల విలువచేసే రూ.2 వేల నోట్లు వచ్చినట్లు బ్యాంకు మేనేజర్ తెలిపారు. మహదేవపూర్ కాళేశ్వరం గ్రామాలలో గల 2 వేల నోట్ల మార్పిడి కోసం కస్టమర్లు పెద్ద‌గా రాలేద‌ని బ్యాంకుల అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉంటే కస్టమర్లకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కాటారం యూనియన్ బ్యాంక్ మేనేజర్ తెలిపారు.

Advertisement

Next Story