కావాల‌నే కొన్ని చానెళ్లు నా మీద బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. ఎమ్మెల్యే నాయిని

by Sumithra |
కావాల‌నే కొన్ని చానెళ్లు నా మీద బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.. ఎమ్మెల్యే నాయిని
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో అస‌మ్మ‌తి నేత‌ల స‌మావేశ‌మంటూ సోష‌ల్ మీడియాలో కొన్ని చానెళ్లు, బీఆర్ఎస్ పార్టీ త‌ప్పుడు ప్ర‌చారం చేసింద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డ అన్నారు. గ‌తంలో అధికారంలో ఉండి కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని దోచుకున్న వాళ్లు.. ఇప్పుడు ఈ ప్ర‌భుత్వంలో ఏదో అస‌మ్మ‌తి చెల‌రేగుతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నార‌ని అన్నారు. నా ప‌ర్మిష‌న్ లేకుండా.. నా ఫోటో పెట్టి నేను అస‌మ్మ‌తిని వ్య‌క్తం చేస్తూ స‌మావేశంలో పాల్గొన్న‌ట్లుగా చిత్రీక‌రిస్తున్నారంటూ మండిప‌డ్డారు. అస‌లు తాను ఎలాంటి స‌మావేశాల‌కు హాజ‌రు కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. కావాల‌నే కొన్ని దొంగ యూట్యూబ్ ఛానెల్స్.. ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్టుగా ప్ర‌చారం చేస్తున్న వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని అన్నారు. ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న మీడియా ప్ర‌తినిధుల‌కు పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ ఓ వీడియోను విడుద‌ల చేశారు. ముఖ్యమంత్రికి, మంత్రుల పై అసమ్మతిగా ఉన్నామని తన ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నాన‌ని తెలిపారు. దీని వెనుకాల ఉన్నవాళ్లను తప్పకుండ శిక్షించాల‌ని కోరుతూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్వ‌యంగా ఆయ‌న లేఖ రాశారు. స‌మ‌గ్ర‌మైన విచార‌ణ చేప‌ట్టాల‌ని కూడా కోరారు. దీని వెనకాల ఉన్న పార్టీలను, వారు సంపాదించిన అక్రమ సంపాదన కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వం పై విషం చల్లే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయంటూ బీఆర్ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్య‌నించారు.

కోడిగుడ్డు పై ఈకలు పీకే చర్యలను మానుకోవాలంటూ తెలిపారు. ఇక స‌మావేశంలో పాల్గొన్నారంటూ కొంత‌మంది ఎమ్మెల్యేల‌ పై చేస్తున్న ప్ర‌చారాన్ని కూడా ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. వాస్త‌వానికి ఎవ‌రైనా పోతే పోయి ఉండ‌వ‌చ్చు.. వారు కూడా కాంగ్రెస్‌ సహచర ఎమ్మెల్యేలను కలుసుకోవడంలో కూడా పెద్ద‌గా త‌ప్పేముందంటూ వ్యాఖ్య‌నించారు. వారేమైనా బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కదా..! దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారంటూ తెలిపారు. ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై కోర్టు ద్వారా పరువునష్టం దాఖలాలు వేస్తున్న‌ట్లు తెలిపారు.


Next Story

Most Viewed