నెరవేరిన మల్లంపల్లి ఆకాంక్ష…

by Kalyani |
నెరవేరిన మల్లంపల్లి ఆకాంక్ష…
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ములుగు మండలం లోని మల్లంపల్లి గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి మల్లంపల్లిని ప్రత్యేక మండలంగా గుర్తించాలంటూ అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్న ఫలితం లేకపోవడంతో గ్రామస్తులందరూ కలిసి జేఏసీగా ఏర్పడి మండల సాధన సమితి పేరు పై ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని మండలం ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం అంటూ ఏళ్ల తరబడి సాగిన ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎట్టకేలకు మల్లంపల్లి మండలాన్ని చేస్తూ గురువారం జీవోని జారీ చేసింది. గ్రామ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం మల్లంపల్లిని మండలంగా ప్రకటించడంతో గ్రామ ప్రజలు సంబరాల్లో మునిగితేలారు.

2014 నుండి మల్లంపల్లి మండలం ఆకాంక్ష...

తెలంగాణ ఉద్యమం ముగిసిన వెంటనే ములుగు జిల్లా మల్లంపల్లి మండలం ఏర్పాటు కోసం 2014 నుండి గత మాజీ సర్పంచ్ గోల్కొండ రవి అలాగే చందకుమార్ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. స్థానిక యువకులు మల్లంపల్లి మండల సాధన సమితి పేరుతో కమిటీ గా ఏర్పడి గోల్కొండ రాజును అధ్యక్షుడిగా ఎన్నుకొని మండల ఏర్పాటు కోసం పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రారంభించారు.

మల్లంపల్లి మండల సాధన కై ఉద్యమాలు...


మల్లంపల్లి మండల ఏర్పాటు కోసం మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు వినూత్నమైన కార్యక్రమాలతో ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని మండల ఆకాంక్షను తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 ములుగు ప్రజా ఆశీర్వాద సభలో మల్లంపల్లి ని మండలంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఎందుకు మండలంగా ఏర్పడాలి అనే అంశం, మండలం ప్రయోజనాలను సామాన్య జనానికి అర్ధమయ్యేలా చెయ్యడంలో మండల సాధన సమితి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలను నిర్వహించింది. బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన మండలాల జాబితాను విడుదల చేసినప్పుడు ఆ జాభితాలో మల్లంపల్లి పేరు లేకపోవడంతో సాధన సమితి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిపారు.


ఈ కార్యక్రమంలో సాధన సమితి నాయకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి చేస్తున్న సాధన సమితి ఉద్యమానికి మల్లంపల్లి ప్రజల మద్దతుతో పాటు చుట్టు పది గ్రామపంచాయతీల నాయకుల కలయికతో యుద్ధం ఇంకా మిగిలే ఉంది అనే శీర్షికలో ఉద్యమ శిబిరాన్ని ఏర్పాటు చేసి 100 రోజులు నిరంతరంగా అనేక రూపాల్లో ఒక క్రమ పద్ధతిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రికి ఎదురై, ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా, రాస్తారోకోలు, ధర్నాలు ,ర్యాలీలు,వంట వార్పు తోపాటు కలెక్టరేట్ ముట్టడి,అసెంబ్లీ ముట్టడి, వ్యూహత్మాకమైన ఎత్తుగడలతో ఎదురు వచ్చినా ప్రతి సందర్భాన్ని మండలం కోసం అందిపుచ్చుకొని ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు.

జెడి పేరుతో మల్లంపల్లి మండలం పేరు....

ప్రభుత్వ పక్షాన ములుగు జిల్లా ఇన్చార్జి జడ్పీ చైర్మన్ గా గతంలో కొనసాగిన మల్లంపల్లి వాస్తవ్యులైన కుసుమ జగదీశ్వర్ మండల ఏర్పాటు కోసం పరితపించిన పార్టీ అంతర్గత సమస్యల వల్ల ఆలస్యాన్ని చవిచూశాడు. అనేక రకాలుగా ప్రయత్నాలు చేసాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట హామీ ఇప్పించేంత కృషి చేసినప్పటికి చివరకు అంతిమ ఫలితం చూడలేకపోయాడు. మొదటి నుండి ఉద్యమ నేపథ్యం ఉన్న కుసుమ జగదీశ్వర్ సాధన సమితి ఉద్యమాన్ని గౌరవించి ఒక సందర్భంలో మల్లంపల్లి మండల ఏర్పాటు కోసం ఏడు ఎంపీటీసీల పార్టీ నిబంధన కోసం నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను కలుపుకోవడానికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నంలో మండలం కోసం తన ఆత్మ అభిమానాన్ని సైతం పక్కనపెట్టి పాద నమస్కారాలతో ఒప్పించే ప్రయత్నం చేశారని, అకస్మాత్తుగా అనారోగ్య కారణంతో కుసుమ జగదీశ్వర్ మరణించడంతో మల్లంపల్లి స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జేడీ మల్లంపల్లి గా మండలాన్ని ప్రకటించాలని మండల సాధన జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంత్రి సీతక్క సైతం మల్లంపల్లి మండలానికి గ్రామస్తులు సూచించిన విధంగా జెడి పేరు పై మండలం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి సీతక్క మేలు మల్లంపల్లి వాసులు మర్చిపోరు - మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యే గా ఉన్న సీతక్క సాధన సమితి ఉద్యమానికి పూర్తి మద్దతును ఇవ్వడమే కాకుండా అసెంబ్లీలో సైతం తన గొంతు ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న సీతక్క అదే స్థాయిలో ప్రైమరీ గెజిట్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి ఇచ్చిన మాట కోసం మండలాన్ని ఏర్పాటు చేశారు. మండల ఏర్పాటులో మంత్రి సీతక్క చేసిన మేలు మల్లంపల్లి గ్రామస్తులు ఎన్నటికీ మరువలేరు.

జడ్పీ చైర్మన్ జగదీష్ పేరుతో జెడి మల్లంపల్లిగా మండలం పేరు పెడతాం-మంత్రి సీతక్క.

శుక్రవారం మల్లంపల్లి ఏర్పాటుపై మల్లంపల్లిలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడవక ముందే మల్లంపల్లి మండలం ప్రకటించాం అని, ఎటువంటి ఆంక్షలు అడ్డంకులు లేకుండా సంపూర్ణ గెజిట్ నెంబర్ విడుదల చేసామని తెలిపారు. గత ప్రభుత్వం నామమాత్రంగా మల్లంపల్లి మండలం ప్రకటించినప్పటికీ మండలం కాకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయి అని, పాదయాత్రలో భాగంగా ములుగు వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మండలం ప్రకటించారు అని, మల్లంపల్లి మండలం ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్త మండలానికి కావలసిన వసతులు,అన్ని శాఖల భవనాలు ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తాం అని, తొందర్లోనే 400 ఎకరాల భూమి సేకరించి,చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని, దివంగత జడ్పీ చైర్మన్ జగదీష్ పేరుతో జెడి మల్లంపల్లిగా మండలం పేరు పెడతాం అని అన్నారు.

Advertisement

Next Story