క్వారీల్లో కాంటాలు లేకుండా లోడింగ్

by Kalyani |
క్వారీల్లో కాంటాలు లేకుండా లోడింగ్
X

దిశ, మంగపేట: మండలంలోని మల్లూరు, వాడ గూడెం, రమణక్కపేట ఇసుక క్వారీల్లో లోడింగ్ వచ్చే లారీల నుండి వే బ్రిడ్జి కాంటాల పేరుతో టీజీ ఎండీసీ దారి దోపిడీకి పాల్పడుతుంది. మూడు క్వారీల్లో ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల మేరకు ఒక్కో క్వారీ నుండి కేవలం 40 లారీలకు మాత్రమే ఇసుకను కూలీలతో లోడింగ్ చేయించాల్సి ఉండగా భారీ జేసీబీలు, పొక్లెయిన్ తో రాత్రింబవళ్లు లోడింగ్ చేసుకుంటూ ఒక్కో లారీ నుండి టన్నుకు 16 వందలు అక్రమ వసూళ్లు చేస్తున్నారు. ఈ తతంగం అంతా టీజీ ఎండీసీ అధికారుల కనుసన్నలతోనే జరగడం విశేషం. ఇదేమని ప్రశ్నించే లారీ డ్రైవర్లను క్యూ లైన్ల పేరుతో వందల లారీలను గంటలు, రోజుల తరబడి రోడ్లపై నిలబెట్టి ట్రాఫిక్ అంతరాయానికి గురిచేస్తున్నారు. క్వారీల్లో కాంటాలు లేకుండా జేసీబీలతో ఇష్టం వచ్చినట్లు లోడింగ్ చేస్తూ కాంటాల పేరుతో రాజుపేట, వాడ గూడెం, చుంచుపల్లి, కమలాపురం, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి లోని వే బ్రిడ్జీల్లో కాంటాలు చేస్తూ ఒక్కో లారీ నుండి రూ.4 వందలు వసూళ్లు చేస్తున్నారు.

ఈ రకంగా కాంటాల పేరుతో ఒక్కో వే బ్రిడ్జీలో సుమారు 40 వేల రూపాయల వరకు టీజీ ఎండీసీ అక్రమ వసూళ్లు చేస్తున్నది. మంగపేట నుండి చిన్నబోయినపల్లి వరకు ఉన్న 40 కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఇసుక లారీని కాంటాల కోసం గంటల తరబడి రోడ్లపై నిలబెట్టి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మండలంలోని రాజుపేట కమలాపురం నుండి చిన్నబోయినపల్లి వరకు ఎక్కడా ఇసుక డంపింగ్ యార్డులు కాని లేవు ఈ క్రమంలో లారీలను కాంటాల పేరుతో ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది ఎవరికీ తెలియని చిక్కు ప్రశ్న. దీంతో లారీ డ్రైవర్లు, యజమానులు ఒక్కో లారీకి కాంటాల పేరుతో 16 వందల వరకు నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ వ్యవహరం ప్రభుత్వానికి తెలిసి జరగుతుందో బడా బ్యూరోక్రాట్ల కనుసన్నలలో జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండటంతో లారీల యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం తెచ్చిన నూతన పాలసీ విధానంపై దుమ్మెత్తిపోస్తున్నారు. టీజీ ఎండీసీ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ నిర్ణయాల మేరకు జరుగుతుందో లేదా టీజీ ఎండీసీ అధికారులు ఇసుక పాలసీలోని కొందరు తిమింగలాలతో కలిసి నిబంధనలు తుంగలో తొక్కి తన ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు టీజీ ఎండీసీ పీవో శ్రీధర్ ను సంప్రదించేందుకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.

సాండ్ బజార్ లారీలకు నో సీరియల్.. చో చెకింగ్


హైదరాబాద్ లోకల్ డంపింగ్ పేరుతో సాండ్ బజార్ ఏర్పాటు చేసి సుమారు 200 లారీలకు అనుమతులిచ్చిన టీజీ ఎండీసీ అధికారులు ఆ లారీలకు బల్క్ బుకింగ్ పేరుతో అనుమతులిచ్చి వాటికి ప్రభుత్వ స్టిక్కర్లను అంటించారు. ఆ లారీలకు మండలంలోని మల్లూరు, వాడ గూడెం, రమణక్కపేట ఇసుక క్వారీలకు వెల్లడానికి లోడింగ్ చేయడానికి ఎలాంటి సీరియల్, చెకింగ్ లేకుండా రాజమార్గంలో పంపుతూ ప్రతి లారీలో 16 టన్నులకు పైగా ఇసుక లోడింగ్ చేస్తూ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ లారీలను కూడా సాధారణ లారీల లాగే అన్ని నిబంధనలు వర్తించేలా ప్రభుత్వ పాలసీ మేరకు టీజీ ఎండీసీ అధికారులు చర్యలు తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాల్సి ఉంది. అదే విధంగా సాండ్ బజార్ లారీలకు బల్క్ బుకింగ్ పేరుతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపనలున్నాయి. బల్క్ బుకింగ్ పేరుతో ఇష్టారీతిగా క్వారీల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా యదేచ్ఛగా ఇసుక తరలిస్తూ టీజీ ఎండీసీ ఉన్నతాధికారుల కనుసన్నల్లో ఇసుక తరలింపు జరుగుతుందనే ఆరోపనలున్నాయి. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఇసుక డిమాండ్ మేరకు టీజీ ఎండీసీ అధికారులు సాండ్ బజార్ లారీలను తమ అక్రమ వ్యాపారాలకు వాడుకుంటున్నట్లు ఆరోపనలున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దృష్టి సారించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

సాండ్ బజార్ లారీల నిబంధనలే మాకు వర్తించాలి : శ్రీనివాస్ నాయుడు(వరంగల్ జిల్లా లారీ యజమానుల సంఘం ఉపాధ్యక్షుడు)

సాండ్ బజార్ లారీలకు ఉన్న నిబంధనలే తమకు వర్తింపజేయాలని వరంగల్ లారీ అసోసియేషన్ ఉపాద్యక్షుడు శ్రీనివాస్ నాయుడు డిమాండ్ చేశారు. తాము 26 టన్నుల ఇసుక డీడీ తీస్తే లారీ ఎంటీ వెయిటింగ్ తో కలిపి 26 టన్నులు వే బ్రిడ్జీలో కాంటా చేయడంతో తాము 3 టన్నుల ఇసుక నష్టపోతున్నామని తమ ఎంటీ లారీల వేయింగ్ లాస్ తీసేసి 26 టన్నుల ఇసుక నింపాలని డిమాండ్ చేశారు. సాండ్ బజార్ లారీల్లో ఇసుకను 26 టన్నులు పంపుతున్నప్పుడు తమకు సైతం 26 టన్నులే ఇసుక అనుమతులివ్వాలని టీజీ ఎండీసీ అధికారులను డిమాండ్ చేశారు. సాండ్ బజార్ లారీలకు ఎంటీ కాంటాలు చేయకుండా 26 టన్నులు ఇసుకను అనుమతించడం దారుణమన్నారు. తాము కూడా ఆ లారీల వలే టాక్సులు, పన్నులు కట్టినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, టీజీ ఎండీసీ అధికారులు కాంటాల పేరుతో లారీల యజమానులను వేదించడం మానుకోవాలని కోరారు. ఇసుక క్వారీల నుండి వచ్చిన లారీలను టీజీ ఎండీసీ అధికారులు ఒక్క దగ్గర కాంటాలు చేయించి అదే బిల్లుపై అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. ఇలా మంగపేట నుండి హైదరాబాద్ వరకు ఎక్కడ పడితే అక్కడ లారీలను వే బ్రిడ్జీల వద్ద కాంటాలు చేసి తమను ఇబ్బందుల పాలు చేసి వీధుల్లో పడేలా చేయవద్దని కోరారు.



Next Story