నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం వద్దు..

by Sumithra |
నిరుద్యోగుల జీవితాలతో రాజకీయం వద్దు..
X

దిశ, కేయూక్యాంపస్ : జిల్లా వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న యూనివర్సిటీల నిరుద్యోగ విద్యార్థుల కోసం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన`ఈ-రాకేష్ రెడ్డి లర్నింగ్ యాప్` ను శుక్రవారం హరిత హోటల్లో ప్రారంభించారు. నిరుద్యోగులు ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకునే అవకాశం ఉందన్నారు. నిరుద్యోగుల సమస్యల పై రాజకీయం చేస్తాం కానీ నిరుద్యోగులతో కాదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణ రావు, ఆప్ రూపకర్త చక్రవర్తి, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ లు, ప్రొఫెసర్ ఇస్తారి, ప్రొఫెసర్ విజయ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ఎన్వీరమణ రావు మాట్లాడుతూ వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆర్థికంగా వెనుకబడి ఉన్న నిరుద్యోగుల కోసం ఇలాంటి ఒక ప్రత్యేక ఆప్ ను రూపొందించడం అత్యంత అభినందనీయమన్నారు.

నేటి ఆన్లైన్ పరిస్థితులకు అనుగుణంగా నిరుద్యోగులు ఎక్కడైనా ఎప్పుడైనా చదువుకునేందుకు వీలుగా యాప్ ను రూపొందించారన్నారు. కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకులు ప్రొ.విజయ్ బాబు, ప్రొ.ఇస్తారీ మాట్లాడుతూ ప్రతీ ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నేను మీ స్థానం నుండే వచ్చాను. నాకు ఆ బాధ తెలుసు కాబట్టే ఆ బాధల బంది నుండి మిమ్మల్ని విముక్తులు చేయడం కోసమే నా ఈ చిరు ప్రయత్నమని.. ఈ యాప్ ద్వారా ఒక్కరు బాగుపడినా నేను వందశాతం విజయం సాధించినట్టేనన్నారు. కూలినాలి చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉద్యోగం రావాలని చదివిస్తున్న తల్లిదండ్రుల ఇబ్బందులు తీర్చడం కోసం నిరుద్యోగులు తమ జీవితాలను లైబ్రరీలకే అంకితం చేస్తూ చదువుతున్నారు.

ఇలాంటి దుస్థితి పోవాలని, మన కొలువులు మనకు కావలని కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామన్నారు. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు. ఒక్కరిచేతిలో బందీ అయి కొట్టుమిట్టాడుతోందన్నారు. రాష్ట్రానికి పట్టిన ఆ మహమ్మారిని తరిమెయ్యల్సిన బాధ్యత మన అందరి మీదా ఉందన్నారు. అనంతరం యాప్ రూపకర్త చక్రవర్తి మాట్లాడుతూ లర్నింగ్ యాప్ లాంచింగ్ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా కాక సమస్త నిరుద్యోగులందరికీ ఉపయోగపడేలాగా నిర్వహించిన రాకేష్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ ఆప్ ద్వారా ఎటువంటి సందేహం ఉన్న అందుబాటులో ఉంటు నివృత్తి చెయ్యడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్పొరేటర్ లు రావుల కోమలా కిషన్, రవినాయక్, బీజేపీ సీనియర్ నాయకులు బైరి శ్రావణ్, రావుల కిషన్, వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థి, నిరుద్యోగ యువత, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story