జ‌న‌గామ‌లో హైడ్రా అటెన్షన్‌.. బ‌తుక‌మ్మ కుంట‌లో భూ అక్రమాలు

by Mahesh |
జ‌న‌గామ‌లో హైడ్రా అటెన్షన్‌.. బ‌తుక‌మ్మ కుంట‌లో భూ అక్రమాలు
X

దిశ‌, జ‌న‌గామ : చెరువుల ఆక్రమ‌ణ‌ల‌పై ప్రభుత్వం చాలా సీరియ‌స్‌గా వ్యవ‌హరించ‌నుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేప‌థ్యంలో జ‌న‌గామ జిల్లా కేంద్రంలోని బ‌తుక‌మ్మ కుంట క‌బ్జాల వ్యవ‌హారం మ‌రోసారి తెర‌పైకి వ‌స్తోంది. ఒక‌ప్పుడు 15ఎక‌రాల పైచిలుకు విస్తీర్ణంతో ఉన్న ధ‌ర్మోనికుంట భూమి క్రమంగా అన్యాక్రాంత‌మ‌వుతూ వ‌చ్చింది. సర్వే నంబర్- 85లో ఉన్న ఈ చెరువు విస్తీర్ణం 9.16ఎకరాల వ‌ర‌కు ఉంటుంద‌ని ఇరిగేష‌న్‌, రెవెన్యూ శాఖ‌ల రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఎఫ్టీఎల్ ప‌రిధిలో ప‌ట్టాలున్నాయ‌నే సాకు చూపుతూ శిఖం భూములను చ‌దును చేస్తూ ప్లాట్లు చేస్తున్నారు.

ప‌ట్టణంలో భూముల‌కు రెక్కలు రావ‌డంతో కొంతమంది రియల్ వ్యాపారులు, ఎఫ్‌టీఎల్ భూముల‌ను చేజిక్కించుకున్న కొంత‌మంది రియ‌ల్ట‌ర్లు, రాజ‌కీయ నేత‌లు చెరువు భూమిని క్రమంగా మింగేస్తూ వ‌స్తున్నారు. ఎఫ్‌టీఎల్ ప‌రిధిని చెరిపేస్తూ.. మున్సిప‌ల్‌, ఇరిగేష‌న్‌, రెవెన్యూ అధికారుల‌కు మాముళ్లు అంద‌జేసి కొంత‌మంది నిర్మాణ అనుమ‌తులు తెచ్చుకుంటున్నారు. తిలాపాపం త‌లా పిడికెడు అన్న చందంగా... చెరువు భూమి అన్యాక్రాంతం వెనుక అధికార‌, వ్యాపార‌, రాజ‌కీయ నేత‌ల భాగ‌స్వామ్యం క‌నిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆరోప‌ణ‌లు..!

2014లో తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆ కుంటను మరమ్మతుల పేరుతో మత్తడిని ధ్వంసం చేయించార‌న్న ఆరోప‌ణ‌లు వస్తున్నాయి. బతుకమ్మ కుంట సుందరీకరణ పేరుతో శిఖం భూమిని ఆక్రమించారని అప్పటి కలెక్టర్‌ దేవసేన ఫిర్యాదులు చేసిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. కుంటకు నీరు వచ్చే, వెళ్లే మార్గాలను ఆక్రమించారని, బతుకమ్మ కుంట లో ఉన్న దుర్గామాత, ఎల్లమ్మ ఆలయాలకు తానే ట్రస్టీనంటూ భూమిని ఎమ్మెల్యే తన పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని అప్పట్లో కురుమలు ఆందోళన నిర్వహించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో గల 5ఎకరాల శిఖం భూమిలో మట్టి పోయించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆ త‌ర్వాత ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో క్రమంగా ప్లాట్లు చేసి.. అమ్మకాలు సాగించారు. ధర్మోనికుంటలో నేడు అనేక భ‌వ‌నాలు వెలిశాయి. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో కూడా మున్సిప‌ల్ అధికారులు భ‌వ‌న నిర్మాణాల‌కు అనుమ‌తులిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

గుబులు పుట్టిస్తున్న హైడ్రా..

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకొచ్చిన హైడ్రా అధికారులు, రియల్ ఎస్టేట్, ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఎంతోమంది ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి నిర్మించుకున్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నా కూడా అధికారులు మామూళ్ల మత్తులో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు, ఇల్లు నిర్మించుకున్నా కన్నెత్తి కూడా చూడలేదు. నిబంధనలకు విరుద్ధంగా చేసిన పనులకు మూల్యం చెల్లించక తప్పదు అనే చర్చ మొదలైంది. ప్రజాప్రతినిధుల అండదండలతో అడ్డగోలు అనుమతులు ఇచ్చిన అధికారుల్లోనూ భయం మొదలైంది.

Advertisement

Next Story

Most Viewed