రైతుల సరుకుకు రక్షణ కరువు.. వాన పడితే రైతుల సరుకులు తడవాల్సిందే(నా)..?

by Disha Web Desk 23 |
రైతుల సరుకుకు రక్షణ కరువు.. వాన పడితే రైతుల సరుకులు తడవాల్సిందే(నా)..?
X

దిశ, వరంగల్‌ టౌన్ : ఏనుమాముల మార్కెట్‌ పాలన అంతా అస్తవ్యస్తంగా తయారైంది. సూపర్‌వైజర్లు, ఖరీదుదారుల కనుసన్నల్లోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇందుకు మంగళవారం నాటి పరిస్థితులే నిదర్శనం. మార్కెట్‌కు వచ్చిన సరుకును కొనుగోలు చేసిన వెంటనే ఖరీదుదారులు అక్కడి నుంచి తరలించాలి. కానీ, అలా చేయకుండా మార్కెట్‌ యార్డుల్లోనే నిల్వ చేస్తున్నారు. ఫలితంగా రైతుల సరుకు పెట్టుకునేందుకు చోటు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వాన పడితే.. రైతుల సరుకు తడిసి ముద్ద కావాల్సిందే. మంగళవారం సాయంత్రం వరంగల్‌ నగరంలో వర్షం కురిసింది.

అయితే, మొక్కజొన్నలు తీసుకొచ్చిన కొందరు రైతులు తమ సరుకును మార్కెట్లో ఆరబోసుకున్నారు. సాయంత్రం బస్తాల్లో నింపి యార్డుల్లోని షెడ్డులో పెడదామంటే ఖరీదు దారుల సరుకులతో అప్పటికే నిండిపోయింది. ఫలితంగా రైతుల సరుకు వానకు తడిసి పోయింది. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో తడిసిన మక్కలను చూసి కన్నీళ్లు దిగమింగుకున్నారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురైతే అప్పటి కార్యదర్శి రాహుల్‌ సూపర్‌వైజర్‌ను హెచ్చరించారు. ఖరీదు దారులు సరుకులు షెడ్డుల్లో పెట్టుకోవద్దని కరాఖండిగా చెప్పారు. అదే సూపర్‌వైజర్‌ ఇప్పుడు అదే తరహాలో వ్యవహరించడం వల్ల మంగళవారం మార్కెట్లో మొక్క రైతులకు తీవ్రనష్టమే వాటిల్లింది. సదరు సూపర్‌వైజర్‌పై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది.

Next Story

Most Viewed