బస్టాండ్ ఉన్నా.. బస్సులు రావు.. అక్కడ విచిత్ర పరిస్థితి

by Sumithra |
బస్టాండ్ ఉన్నా.. బస్సులు రావు.. అక్కడ విచిత్ర పరిస్థితి
X

దిశ, డోర్నకల్: నియోజకవర్గ కేంద్రమైన డోర్నకల్‌లో రైల్వే జంక్షన్, దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన ఎఫిపని చర్చి, అలాగే క్రీడాకారులకు నెలవైనది ఈ ప్రాంతం. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న డోర్నకల్ 1960వ దశకంలో మున్సిపాలిటీ కూడా.. స్థానికంగా సరైన విద్య, వైద్యం లేక పౌరులు విద్య, ఉపాధి కల్పన కోసం యువత, కూలీలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు జిల్లా కేంద్రాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ రవాణా సాధనమైన బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. పట్టణ కేంద్రంలో విశాలమైన ప్రాంగణంలో బస్టాండ్ ఉన్నప్పటికీ అలంకారప్రాయంగా మారింది. ఖమ్మం-ఇల్లందు, మహబూబాబాద్-డోర్నకల్, ఖమ్మం-డోర్నకల్ రాకపోకలు కొనసాగించే ఆర్టీసీ బస్సులు బస్టాండ్ లోపలికి వెళ్లకపోవడంతో ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు రోడ్లపై, రైల్వే ప్రాంగణ ఆవరణంలో మాడు పగిలే మండుటెండలో నిలబడుతున్నారు. అయినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యను పురపాలక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే రెడ్యానాయక్ దృష్టికి తీసుకువెళ్లగా.. సంబంధిత అధికారులు బస్టాండ్ ఆవరణలో దట్టంగా పెరిగిన చెట్ల తుప్పలు తొలగించి కొద్దిరోజుల పాటు బస్సుల రాకపోకలు కొనసాగించారు.

ప్రయాణికులకు ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. ఇటీవల ఆర్టీసీ అధికారులు బస్టాండ్ ప్రాంగణానికి రంగులద్దారు. బస్సులు రాకపోకలకు కృషి చేస్తామని తెలిపారు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. బస్టాండ్ భవనంలో కిటికీలు, కరెంటు బోర్డులు, డోర్లు కనుమరుగయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపం వల్లన బూత్ బంగ్లాలా తయారయ్యింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బస్టాండుకు పునర్జీవం పోయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారు. డోర్నకల్ బస్టాండ్ మాత్రం బస్సులు కనిపించని బస్టాండ్ గానే మిగిలింది. గతంలో కొన్నిరోజులు బస్టాండ్ లోపలికి బస్సులు రాకపోకలు కొనసాగాయి. పర్యవేక్షణ లోపంతో బస్సులు రావడం ఆగిపోయింది. గమ్యస్థానాలకు చేరుకోవడానికి గత్యంతరం లేక మండుటెండలో రోడ్లపై మహిళలు, వృద్ధులు, చంటి పిల్లలతో నిల్చోని బస్సుల, ప్రైవేట్ వాహనాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. డోర్నకల్‌కు బస్టాండ్ ఉన్న సంగతే ప్రజల్లో కనుమరుగవుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుని ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ తిరిగి వినియోగంలోనికి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు- స్థానిక ప్రయాణికుడు గుడిమల్ల రవి

Advertisement

Next Story