Bhatti Vikramarka : విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం కృషి : భట్టి

by Aamani |   ( Updated:2024-09-14 11:05:35.0  )
Bhatti Vikramarka : విద్యుత్ సమస్యలు లేకుండా ప్రభుత్వం కృషి : భట్టి
X

దిశ,ధర్మారం: రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా విద్యుత్ సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆయన మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి నంది మేడారంలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం జరిగిన మీటింగ్‌లో ఓల్టేజి సమస్యలు లేకుండా పెద్ద సంఖ్యలో సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టామన్నారు. అవసరమున్న ప్రతి చోట ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 8నెలల కాలంలో హామీల అమలు కోసం ప్రయత్నిస్తున్నామని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అధికారంలోకి వచ్చిన వారం లోపే ప్రారంభించామన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం దారులు అందరికీ జీరో బిల్లు అందిస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ప్రారంభమయ్యాయని బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒక్క ఉత్పాదన కేంద్రం కూడా ప్రారంభం కాలేదన్నారు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ప్రభుత్వ మంజూరు చేసింది అన్నారు. రామగుండం ధర్మపురి పెద్దపల్లి మంథని నియోజకవర్గాల్లోని టేలండ్ ప్రాంత రైతులకు లబ్ధి చేకూర్చేందుకు పత్తిపాక రిజర్వాయర్ కు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు.

త్వరలోనే సర్వేపల్లి పూర్తై డీటెయిల్స్ ఎస్టిమేషన్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. గత పదేళ్లుగా నిర్వాసితులకు పరిహారం అందించలేకపోయారని, ఈరోజు 18 కోట్ల రూపాయల పరిహారం అందించడం ఆనందంగా ఉందన్నారు.రాష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 15రోజుల్లో 18వేల కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.సాంకేతిక కారణాలతో కొంత మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని అసత్యపు ప్రచారాలు చేశారని, అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

2029 కల్లా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి తీరుతామన్నారు. థర్మల్ పవర్ తో పాటు సోలార్, విండ్ పవర్ ఉత్పాదన చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన పరిశీలించేందుకు పరిచే విధంగా చేసి తీరుతామన్నారు. రామగుండంలో పదివేల కోట్ల రూపాయలతో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రైతులందరి వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా 30గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ పవర్ ప్రభుత్వ ఖర్చుతో అందజేస్తామన్నారు. రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి భట్టికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story