పోరాటాలకు సిద్ధంగా ఉండండి: మాజీ ఎమ్మెల్యే పెద్ది

by Kalyani |
పోరాటాలకు సిద్ధంగా ఉండండి: మాజీ ఎమ్మెల్యే పెద్ది
X

దిశ, నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. నర్సంపేట పట్టణంలోని వాసవి కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ... కొన్ని రోజులుగా నర్సంపేట డివిజన్ లో పోలీస్ చర్యలు హద్దులు మీరుతున్నట్లు ఆరోపించారు. నర్సంపేట పట్టణం సహా డివిజన్ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, తండాల్లోని భూతగాదాల్లో పోలీసుల జోక్యం పెరిగిందన్నారు. ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం రాలేదన్నారు. అమాయకులపైన, బలహీనవర్గాల పైన, పోలీసులు ఏక పక్షంగా కేసులు పెడుతున్నట్లు ఆరోపించారు. నెక్కొండ, చెన్నారావుపేట, నర్సంపేట పోలీస్ స్టేషన్ లో ఎక్కువ అక్రమ కేసులు నమోదు చేస్తున్నట్లు హాట్ కామెంట్స్ చేశారు.

అధికార పార్టీ నేతలు, పోలీసులు చేస్తున్న అవినీతి, అక్రమాలపైన అన్ని ఆధారాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. అవసరమైతే పోలీస్ స్టేషన్ల ముందు నిరసనలు, ధర్నాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్ని కేసులైనా భయపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఎవరి పైన కేసు జరిగినా దానికి బాధ్యత వహిస్తానని హామీనిచ్చారు. ఈ సంఘటనల పై హైకోర్టును, ఎస్సీ ఎస్టీ కమిషన్లతో పాటు హెచ్.ఆర్.సీ కి ఫిర్యాదు చేయడానికి, బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్లను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నెల 25వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో జరిగే లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed