- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కార్యకర్తలే నా బలం ప్రజలే నా బలగం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

దిశ, పెద్దవంగర: పార్టీ కార్యకర్తలే తన బలమని ప్రజలే తన బలగమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండల కేంద్రంతో పాటు వడ్డేకొత్తపల్లి, పోచారం, కోరిపల్లి, మోత్య తండా గ్రామాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా తనకు కలిగినట్టేనన్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వ లేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల మేలు కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అమలు చేస్తూ ప్రజల మనసును గెలుచుకుంటున్నామని చెప్పారు. ఆయా గ్రామాల వారీగా పెండింగ్ ఉన్న సమస్యలు, చేయాల్సిన పనులు, జరగాల్సిన అభివృద్ధిపై కార్యకర్తలతో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయా గ్రామాల ప్రజలు, కార్యకర్తలు తన దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను అక్కడికక్కడే మంత్రి పరిష్కరించారు.
ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ కేసీఆర్, దయాకర్ రావుల వల్ల పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరిగిందన్నారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన సతీమణి ఉషా దయాకర్ రావులు పార్టీ శ్రేణులతో కలిసి వడ్డిస్తూ భోజనాలు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలలో మాజీ ఎమ్యెల్యే సుధాకర్ రావు, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరాం జ్యోతిర్మయి, పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.