వారంలో కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా.. ఎమ్మెల్యే రాజ‌య్య సంచలన వ్యాఖ్య‌లు

by Dishaweb |   ( Updated:2023-08-25 14:09:25.0  )
వారంలో కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తా.. ఎమ్మెల్యే రాజ‌య్య సంచలన వ్యాఖ్య‌లు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఆరునూరైనా తాను ప్ర‌జా జీవితంలోనే ఉంటాన‌ని, ప్ర‌జ‌ల్లో ఉంటూనే చ‌నిపోతానంటూ ఎమ్మెల్యే తాటికొండ‌ రాజ‌య్య భావోద్వేగంతో అన్నారు. శుక్రవారం ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ కుల వృత్తుల లబ్ధిదారులకు రూ.1 లక్ష చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. కార్య‌క్ర‌మం చివ‌ర‌ల్లో ఆయ‌న హాట్ కామెంట్స్ చేశారు. ఆరునూరైన ప్రజా జీవితంలోనే ఉంటానని అన్నారు. పంట పండించి కుప్ప పోసిన తర్వాత ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊరుకుంటానా అని అన్నారు. రేపోమాపో భవిష్యత్ కార్యాచరణ జరుగుతుందని అన్నారు. ప్రజల్లోనే ఉంటానని, ప్రజల్లోనే చనిపోతానని వాఖ్యానించారు. తాటికొండ రాజ‌య్య న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల్లోని అర్థ‌మేంట‌న్న‌ది ఇప్పుడు స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లోని రాజ‌కీయ వ‌ర్గాల మెద‌ళ్ల‌ను తొలుస్తోంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజ‌య్య‌కు బ‌దులుగా ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రికి ఇటీవ‌ల బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థుల్లో చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే. రాజ‌య్య‌కు టికెట్ నిరాక‌ర‌ణ‌తో ఆయ‌న అనుచ‌రుల్లో అసంతృప్తి నెల‌కొంటోంది. ఇటీవ‌ల క‌డియం శ్రీహ‌రికి స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో స్వాగ‌తం ప‌లికే కార్య‌క్ర‌మానికి కూడా రాజ‌య్య హాజ‌ర‌వ‌లేదు. అంత‌కు ముందు ఆయ‌న ఇంటికి ఎమ్మెల్సీ ప‌ల్లా, క‌డియం స్వ‌యంగా వెళ్లినా.. ఆయ‌న ఇంటికి తాళం వేసి వెళ్లిపోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీ మారాలని, కాంగ్రెస్‌లోకి వెళ్దామంటూ రాజ‌య్య‌పై ఆయ‌న అనుచ‌రుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి ఐదు రోజుల క్రితం ఘ‌న్‌పూర్‌లో ఆయ‌న మీడియా ఎదుట అంబేద్క‌ర్ విగ్ర‌హం ఎదుటే బోరున విల‌పించారు. అనుచరులు సైతం కంట‌త‌డి పెట్టారు. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడ‌బోన‌ని, త‌న ప్ర‌యాణం కేసీఆర్‌తోనే ఉంటుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఈ ప‌రిణామం త‌ర్వాత ఆయ‌న అనుచ‌రుల నుంచి మాత్రం ఆయ‌న తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న‌ట్లుగా తెలుస్తోంది.

కాంగ్రెస్ నుంచి సైతం ఆయ‌న‌కు సానుకూల సంకేతాలు అందిన‌ట్లుగా తెలుస్తోంది. ఈనేప‌థ్యంలో పార్టీ మారితే గెలుపు ఖాయ‌మ‌నే భావ‌న‌, విశ్లేష‌ణ‌ల‌తో ఆయ‌న్ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు సమాచారం. బీఆర్ ఎస్‌లోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్న రాజ‌య్య తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌తో కొంత రాజ‌కీయ వేఢిని పుట్టిస్తున్నాయి. రాజ‌య్య మాట‌ల్లోని అంత‌రార్థాన్ని వెతికి ప‌ట్టుకునే ప‌నిలో ఇటు బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ నేత‌లు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ అధిష్ఠానానికి సైతం ఆయ‌న క్లియ‌ర్ ఇండికేష‌న్ ఇస్తున్నారా..? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. వారంలోపు ఎలాంటి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌బోతున్నార‌నే దానిపైనా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed