మార్పు తీసుకొద్దాం.. బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి: నెటిజన్లకు సజ్జనార్ సందేశం

by Ramesh N |   ( Updated:2025-03-15 18:05:25.0  )
మార్పు తీసుకొద్దాం.. బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి: నెటిజన్లకు సజ్జనార్ సందేశం
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ (Betting Apps Promotion) హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్‌కు బానిసై.. అప్పుల బారిన పడి, తీర్చలేక ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్‌ను చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ అధికారి, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తనదైన శైలిలో వారికి చుక్కలు చూపిస్తున్నారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులకు సజ్జనార్ సూచిస్తున్నారు. ఇటీవల ఏపీకి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని, రైడర్ భయ్యా సన్నీ యాదవ్‌పై కేసుల విషయంలో సజ్జనార్ కీలక పాత్ర పోషించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా సజ్జనార్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌పై ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ హర్ష సాయి (Harsha sai)కి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో హర్ష సాయి తన తప్పును సమర్థించుకుంటున్నారు.

ఇలాంటి వాళ్లనా మీరు ఫాలో అవుతుంది

'నేను బెట్టింగ్ యాప్‌లను చాలా బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నాను. నేను ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్లు చేస్తారు కదా.. అయినా నాలాంటి వాళ్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం తప్పు కాదు.. చేయకపోతే తప్పు' అంటూ హర్షసాయి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో క్లిప్‌ను సజ్జనార్ షేర్ చేశారు. 'చేస్తున్న‌దే త‌ప్పు, అదేదో సంఘ‌సేవ చేస్తున్న‌ట్టు ఎంత గొప్ప‌లు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌ల‌ను ప్ర‌మోట్ చేయ‌కుంటే ఎవ‌రో ఒక‌రు చేస్తార‌ని ఈయ‌న చేస్తున్నాడ‌ట. బుద్దుందా అస‌లు! ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే క‌నీసం ప‌శ్చాత్తాపం లేదు. వీళ్లకు డ‌బ్బే ముఖ్యం, డ‌బ్బే స‌ర్వ‌స్వం.. ఎవ‌రూ ఎక్క‌డ పోయినా, స‌మాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్న‌మైన సంబంధం లేదు. ఈయ‌న‌కు 100 కోట్ల నుంచి 500 కోట్ల వ‌ర‌కు ఆఫ‌ర్ చేశార‌ట‌. అంతగ‌నం డ‌బ్బు ఎక్క‌డి నుంచి వ‌స్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్ ని మార్కెట్‌లో పెట్టి కోట్ల‌కు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్ల‌నా.. మీరు ఫాలో అవుతోంది. వెంట‌నే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్స‌ర్ల‌ను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్ల‌ను రిపోర్ట్ కొట్టండి' అని రాసుకొచ్చారు. ఈ క్రమంలోనే కేంద్రం, తెలంగాణ, ఏపీ, సైబర్ పోలీసులకు వీడియోను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ వైరల్‌‌గా మారింది. వీసీ. సజ్జనార్ నెక్ట్స్ టార్గెట్ అతడేనా? అనే చర్చ మొదలైంది. దీంతో యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలేలా ఉంది.

బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి: సజ్జనార్

బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండని సజ్జనార్ మరో ట్వీట్‌లో పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న స్పందన బాగుందని తెలిపారు. ‘బెట్టింగ్ అవగాహన వీడియోలను రూపొందించడానికి అనుమతి కోరుతూ చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు నన్ను సంప్రదిస్తున్నారు. ఇది శుభ పరిణామం. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీస్తోన్న బెట్టింగ్ మహమ్మారిని అరికట్టడానికి ఎవరి అనుమతి అవసరం లేదు. సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటే ఇలానే ముందుకు సాగండి. ఈ సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయండి. మనమంతా కలిసి సోషల్ మీడియాలో బెట్టింగ్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుదాం. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం’ అంటూ సందేశం ఇచ్చారు.

READ MORE ...

Ap: చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్య

గురుకుల వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం



Next Story

Most Viewed