Uppal Stadium: తెల్లవారితే ఉప్పల్‌లో SRH vs CSK మధ్య మ్యాచ్.. భారీ షాకిచ్చిన విద్యుత్ శాఖ అధికారులు

by Shiva |   ( Updated:2024-04-04 16:24:10.0  )
Uppal Stadium: తెల్లవారితే ఉప్పల్‌లో SRH vs CSK మధ్య మ్యాచ్.. భారీ షాకిచ్చిన విద్యుత్ శాఖ అధికారులు
X

దిశ, మేడ్చల్ బ్యూరో/ఉప్పల్/వెబ్‌డెస్క్: ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి విద్యుత్ అధికారులు షాకిచ్చారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. రూ.3.4 కోట్లు విద్యుత్ బకాయిలు చేల్లించకపోవడంతో విద్యుత్ శాఖ కరెంట్ సరఫరాను నిలిపివేసింది. దీంతో స్టేడియం పరిసరాలు అన్ని చీకట్లో మగ్గుతున్నాయి. కాగా, ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడాల్సి ఉంది. అయితే విద్యుత్ సరఫరా ను నిలిపివేయడంతో జనరేటర్ల సహాయంతో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

హెచ్‌సీఏ నిర్లక్ష్యం..

హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (హెచ్ సీఏ) ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన బిల్లులు సక్రమంగా చేల్లించకపోవడంతోనే కరెంట్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిసింది. విద్యుత్ బకాయిలు చేల్లించకుండా కరెంటును యథావిధిగా వాడుకోవడంతో విద్యుత్ శాఖ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)పై విద్యుత్ చౌర్యం కేసులు పెట్టింది. దీంతో హెచ్‌సీఏ కోర్టును అశ్రయించింది. హెచ్ సీఏ‌కు చెందిన హెచ్‌బీజీ 2192 కనెక్షన్ పెండింగ్ బిల్లుల బకాయిల కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో విద్యుత్ శాఖ 2018‌లో కేసు వేశారు. కోర్టులో విద్యుత్ అధికారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో డిఫాల్టర్‌గా ఉన్న హెచ్‌సీఏ పెండింగ్ బిల్లు రూ.1.41 కోట్లతో పాటు రూ.1.64 కోట్లు సర్‌చార్జి కలిపి మొత్తం రూ.3.05 కోట్లు వారం రోజుల్లోగా చెల్లించాలని డిసెంబర్ 6న కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా పలుమార్లు నోటీసులు జారీ చేసినా హెచ్‌సీఏ అధికారుల్లో చలనం లేకపోవడంతో గురువారం టీఎస్ఎస్ పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు విద్యుత్ శాఖ ఎడీఈ బాలక్రిష్ణ తెలిపారు.

మ్యాచ్‌పై అనిశ్చితి..

ఐపీఎల్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య పోటీ జరగనుంది. దీంతో గురువారం ఇరు జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. సాయంత్రం నుంచి ఉప్పల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో జనరేటర్ల సహాయంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిసింది. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్రవారం స్టేడియంలో మ్యాచ్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. మ్యాచ్ జరుగుతుందా? లేదా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్‌ను నేరుగా వీక్షించేందుకు వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు టికెట్లను కొనుగోలు చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు దొరకని అభిమానులు బ్లాక్‌లో రూ.5 వేల టికెట్‌ను రూ.10 నుంచి రూ.15 వేలకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. వారంతా ప్రస్తుతం మ్యాచ్ నిర్వహణపై ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story