Bandi Sanjay : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : అల్లు అర్జున్ అరెస్టు తీరును ఖండించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్ : జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌(Allu Arjun) అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఎక్స్ వేదికగా ఖండించారు. బట్టలు మార్చకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్ రూమ్ నుంచి నేరుగా అరెస్టు చేసి తీసికెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒక జాతీయ అవార్డు గ్రహితను, ప్రముఖ హీరో పట్ల ఈ రకంగా అమర్యాదగా వ్యవహరించి అవమానించి అగౌరవపరిచిన తీరు ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. తన నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడు పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరం, అయితే ఇది భారీ జనసందోహాన్ని నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే ఈ ఘటన నొక్కి చెబుతుందన్నారు.

పుష్ప ది రైజ్ యొక్క అద్భుత విజయం తర్వాత, అభిమానులు పుష్ప ది రూల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారని..హీరో అల్లు అర్జున్ జనాదరణను మేరకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారన్నారు. అంత ముఖ్యమైన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ తప్పుబట్టారు. ఈ నిర్లక్ష్యం, తప్పు ఆమోదయోగ్యం కాదన్నారు. ఇందుకు ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో నేరుగా ప్రమేయం లేని ఐకాన్ స్టార్ అర్జున్, అతని అభిమానులకు గౌరవం ఇవ్వాలని, నేరస్థడుగా చూడటం సరికాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed