కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్‌లు.. నెలాఖరులోగా టెండర్లు

by Shiva |   ( Updated:2025-02-15 02:57:51.0  )
కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్‌లు.. నెలాఖరులోగా టెండర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం కేబీఆర్ పార్కు చుట్టూ రోడ్డు విస్తరణతో పాటు ఏడు జంక్షన్లలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాసులను నిర్మించాలని నిర్ణయించింది. కేబీఆర్ పార్కు చుట్టూ మార్కింగ్ కూడా చేస్తున్నారు. కోర్టు కేసులు కారణంగా టెండర్లు పిలిచే కార్యక్రమం ఆలస్యమైంది. అయితే కోర్టు కేసులున్నా టెండర్లు పిలిచుకోవడానికి అవకాశమున్న.. అధికారులు కోర్టు కేసులు పూర్తయిన తర్వాతనే టెండర్లు పిలవాని నిర్ణయించారు. అయితే 15 రోజుల్లో కోర్టు కేసులు కొలిక్కి వచ్చే అవకాశముందని, ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవనున్నట్టు అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ పార్కు వద్ద ఏడు జంక్షన్లతో గ్రేటర్‌లోని రూ.2,400 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఒక్క అమీన్‌పూర్ రోడ్డు విస్తరణకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. మూడు ఏజెన్సీలు బిడ్ దాఖలు చేశారు.

కేబీఆర్ పార్కు వద్ద రూ.1,090 కోట్లతో..

కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ జంక్షన్, మహారాజా అగ్రసేన్ జంక్షన్, కాన్సర్ హస్పిటల్ జంక్షన్, ఫిల్మ్‌నగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, ముగ్ధ జంక్షన్ల పరిధిలో ఏడు స్టీల్ బ్రిడ్జీలు, ఏడు అండర్ పాసుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గతంలో ప్రభుత్వం మంజూరు ఇచ్చిన రూ.826 కోట్ల కంటే మరో రూ.270 కోట్లు కలిపి రూ.1,090 కోట్లకు ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో స్ట్రక్చర్ నిర్మాణానికి సుమారు రూ.600 కోట్లు ఖర్చయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మిగిలిన రూ.490 కోట్లతో భూసేకరణ, యుటిలిటీ షిప్టింగ్ చేయనున్నట్టు చెబుతున్నారు. కేబీఆర్ పార్కు చుట్టూ, సమీపంలో జంక్షన్ల పరిధిలో ట్రాఫిక్ చిక్కులతో పాటు ‘యూటర్న్’లకు అవకాశంలేకుండా సాఫీగా వెళ్లడానికి అవకాశముంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి మార్గాల్లో వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది.

మరో రూ.1,310 కోట్ల ప్రాజెక్టులకు..

కేబీఆర్ పార్కు వద్ద ఏడు జంక్షన్లతో పాటు మరో రూ.1,310 కోట్ల పనులకు సైతం టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.398 కోట్లతో రేతిబౌలి జంక్షన్ నుంచి నానల్‌నగర్ జంక్షన్ వరకు మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రూ.210 కోట్లతో జూబ్లీహిల్స్ ఎన్ఎఫ్సీ జంక్షన్ వద్ద ఫస్ట్ లెవల్ వన్ వే ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్ మూడు లేన్ల యూని డైరెక్షనల్ అండర్ పాస్ నిర్మించాలని నిర్ణయించారు. రూ.837 కోట్లతో ఖాజాగూడ, ఐఐఐటీ, విప్రో జంక్షన్ల వద్ద మల్టీలెవల్ ఫ్లైఓవర్లను నిర్మించనున్నారు. కుత్బల్లాపూర్‌లోని ఫాక్స్ సాగర్ వద్ద రూ.56 కోట్లతో నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జీని నిర్మించనున్నారు. వీటితో పాటు రూ.150 కోట్లతో విరంచి హస్పిటల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు 100 ఫీట్లు, 120 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో బొటానికల్ గార్గెన్ జంక్షన్ వద్ద అంజయ్యనగర్ నుంచి రాంకీ టవర్ వరకు రూ.31 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. అమీన్‌పూర్ వద్ద రూ.45 కోట్లతో చేపట్టనున్న 150 ఫీట్ల రోడ్డు విస్తరణకు టెండర్లు పిలిచారు. మూడు ఏజెన్సీలు తమ బిడ్లను దాఖలు చేశాయి. వీటిని త్వరలోనే ఓపెన్ చేయనున్నారు.

1942 చెట్ల గుర్తింపు..

కేబీఆర్ పార్కు వద్ద ఏడు జంక్షన్లలో చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణంలో 1,942 చెట్లు దెబ్బతినే అవకాశముందని అధికారులు గుర్తించారు. వీటిలో పార్కు సైడ్ 24, సెంట్రల్ మీడియన్స్‌లో 1,248, ప్రాపర్టీల సైడ్ 670 ఇలా మొత్తం 1,942 చెట్లు ఉన్నాయి. వీటిలో 500 చెట్లను ట్రాన్స్ లోకేట్ చేయాల్సి అవసరంలేదని అధికారులు గుర్తించారు. ముగ్ద జంక్షన్ 52, కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్ 284, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ 371, రోడ్డు నెం.45 జంక్షన్ 232, ఫిల్మ్ నగర్ 202, మహారాజా అగ్రసేన్ 457, కాన్సర్ హస్పిటల్ జంక్షన్ వద్ద 344 చెట్లు ఉన్నాయి.

Next Story

Most Viewed