- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టారాజ్యంగా కన్‌స్ట్రక్షన్స్.. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
దిశ, జనగామ: జనగామ పట్టణంలో డ్రైనేజీల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. కొన్నేళ్లుగా చిన్నపాటి చినుకు పడితే చాలు పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. వేసవి కాలంలో సైతం రోడ్లపై మురుగునీరు చేరి వర్షాకాలన్ని తలపిస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి అధిగమించేందుకు ప్రభుత్వం టీయూఎఫ్ఐడీసీ సంస్థ నుంచి డ్రైనేజీ నిర్మాణాల కోసం రూ.9.10 కోట్లు మంజూరు చేసింది. మున్సిపల్, ప్రజారోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మొత్తం 1400 మీటర్ల పొడవునా డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం పనులు ప్రారంభమై నత్తనడకన కొనసాగుతున్నాయి. అంతేకాదు, అలైన్మెంట్ లో పొందుపరచిన మార్గదర్శకాల మాదిరి రోడ్డు ఎలా ఉంటే అలా వంకరగా, నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఈ నిర్మాణాలకు సంబంధించి మార్చిలో పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. టీయూ ఎఫ్ఐడీసీ (తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్), ప్రజారోగ్య శాఖ ద్వారా టెండర్ ప్రక్రియ నిర్వహించి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థకు పనులు అప్పగించింది. అయితే సదరు నిర్మాణ సంస్థ ఈ పనులను లోకల్ కాంట్రాక్టర్కు అప్పగించింది. మూడు నెలల క్రితం ప్రారంభం కావాల్సిన పనులు 20 రోజుల క్రితం ఆలస్యంగా మొదలయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు కావస్తున్నా పురోగతి లేకపోవడం పట్టణవాసులకు ఇబ్బందికరంగా మారింది. అంతేకాదు, నిబంధన ప్రకారం హైదరాబాద్ - వరంగల్ హైవే లను కలిపే రహదారిలో ఈ నిర్మాణం చేపడుతున్నందున మాస్టర్ ప్లాన్లో పొందుపరిచినట్లుగా రోడ్డు మధ్య నుంచి ఇరువైపులా 50 అడుగుల దూరంలో డ్రైనేజీని నిర్మించాల్సి ఉంది.
కానీ, అందుకు భిన్నంగా ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికార వ్యవస్థ దీని వెనక ఉన్న ఓ నాయకుడిని చూసి ఏమి పట్టించుకోకుండా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భవిష్యత్తులో మరింత ఇబ్బంది కలిగే పరిస్థితి నెలకొంది. ఈ డ్రైనేజీల నిర్మాణం వరంగల్ - హైదరాబాద్ రోడ్డుకు ఇరువైపులా రెండు బిట్లుగా చేపట్టాలని మార్గదర్శకాల్లో పొందుపరచి ఉంది. దీని ప్రకారం జనగామ పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా నుంచి సెయింట్ మేరీ స్కూల్ ప్రాంతంలోని 60 ఫీట్ల రోడ్డు వరకు ఒకటి, హైదరాబాద్ - వరంగల్ రోడ్డులోని ఓవా హోటల్ నుంచి సెయింట్ మేరీ స్కూల్ 60 ఫీట్ల రోడ్డు వరకు రెండు ఆపోజిట్ నిర్మాణాలు కలిసే విధంగా చేపడుతున్నారు. ఈ రెండు డ్రైనేజీల గుండా ప్రవహించే మురుగు నీరు సెయింట్ మేరీస్ స్కూల్ వెనక నుంచి కలెక్టరేట్ సమీపంలోని గార్లకుంట దిశగా పూర్వపు వర్షం నీరు ప్రవహించే మార్గం వైపు వెళ్లే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నప్పటికీ, పురోగతిలో వేగం లేక పట్టణవాసులు, ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణదారులు, చిరు వ్యాపారస్తులు అవస్థలు పడుతున్నారు.
నిబంధనలు ఇలా...
నిబంధన ప్రకారం 1400 మీటర్ల మేర పట్టణంలో డ్రైనేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలి. అది కూడా నాలుగు ఫీట్ల లోతు, నాలుగు ఫీట్ల వెడల్పుతో పట్టణంలోని హైదరాబాద్ - వరంగల్ రోడ్డులో ఇరువైపులా రెండు బిట్లుగా చేపట్టాలి. అంతే కాకుండా తప్పనిసరిగా రోడ్డుకు ఇరువైపులా 50 అడుగుల దూరంలో సమాంతరంగా సరళరేఖ మాదిరిగా ఈ నిర్మాణాలు చేపట్టాలి. కానీ ఎక్కడ ఇది అమలు కావడం లేదు. ఇందుకు కారణం టెండర్ దక్కించుకున్న కంపెనీ పనులను చేపట్టాల్సి ఉండగా మరో కాంట్రాక్టర్ తో ఒప్పందం కుదుర్చుకొని పనులు అప్పగించింది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తే నిబంధనల మేరకు పనులు జరిగేలా చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం పర్యవేక్షణలో పనులను వేగవంతంగా, నిబంధనల మేరకు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. లేకపోతే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.