టీయూ సరే.. కేయూ సంగతేంది? కన్నెత్తి చూడని సర్కార్

by Sathputhe Rajesh |
టీయూ సరే.. కేయూ సంగతేంది? కన్నెత్తి చూడని సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ అక్రమాలపై సీరియస్‌గా ఉన్న ఉన్నత విద్యాశాఖ ఆఫీసర్లు.. కాకతీయ యూనివర్సిటీ విషయంలో మాత్రం మౌనం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ విద్యావర్ధినిని నియమించడాన్ని తప్పుపట్టిన సదరు అధికారులకు కేయూలో ఓ రిటైర్డ్ ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించడం, పైగా ఆయనకే మూడు కీలకమైన పరిపాలన పదవులు అప్పగించడం కనిపించడం లేదా అని కేయూ విద్యార్థి, అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ కనుసన్నల్లో కేయూని నడిపిస్తూ.. పార్ట్ టైం నుంచి కాంట్రాక్ట్ కన్వర్షన్, న్యాక్ పనుల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా ఉన్నత విద్యాశాఖ ఆఫీసర్లు ఎందుకు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రా ర్ నియామకంపై వివాదాలు

కేయూ వీసీగా ప్రొఫెసర్ తాటికొండ రమేశ్​ నియామకంపై కోర్టులో ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రొఫెసర్‌గా పదేండ్ల అనుభవం లేకున్నా వీసీగా నియమించారంటూ ఇప్పటికే హైకోర్టులో ఒక కేసు, లోకాయుక్తలో మరో కేసు నడుస్తోంది. వీసీగా రమేశ్ బాధ్యతలు చేపట్టిన మొదటి నాలుగు నెలల్లోనే ఆయన తీరు నచ్చక ఇద్దరు రిజిస్ట్రార్లు రాజీనామా చేశారు.

సీనియర్ ప్రొఫెసర్లను కాదని..

కేయూ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు మూడు కీలకమైన పదవుల్లో కొనసాగుతున్నారు. రిజిస్ట్రార్ పదవితో పాటు ఎస్‌డీఎల్‌సీఈ (దూరవిద్యాకేంద్రం) డైరెక్టర్‌గా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల సెల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ.. వారిని కాదని ఓ రిటైర్డ్ ప్రొఫెసర్‌కు బాధ్యతలు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

రెండు నెలల క్రితమే ఈసీ కాలపరిమితి పూర్తయింది. కొత్త కమిటీ వేయాలని కేయూ వీసీ రమేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు. మరో కొత్త కమిటీ వేసే వరకు పాత ఈసీనే కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకతీయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్, పార్ట్‌టైం కింద 12 మంది ప్రొఫెసర్లను ఈ ఏడాది జనవరి 30న జరిగిన 144వ అత్యవసర పాలక మండలి సమావేశంలో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీసీ తనకు నచ్చిన వారిని నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

నోటిఫికేషన్, ఇంటర్వ్యూ లేకుండానే..

రాష్ట్ర ఏర్పాటు అనంతరం నుంచి ఇప్పటి వరకు కేయూలో సర్కార్ పర్మిషన్ లేకుండా వివిధ డిపార్ట్‌మెంట్లలో 59 మంది పార్ట్‌టైం లెక్చరర్లుగా నియామకమయ్యారు. వీరిలో చాలా మంది ఎలాంటి నోటిఫికేషన్లు, కనీసం ఇంటర్వ్యూ లేకుండా పైరవీ ద్వారా డిపార్ట్‌మెంట్ల కమిటీల సిఫార్సుతో అపాయింట్ అయ్యారు.

2014 జూన్ 2 తర్వాత సర్కార్ అనుమతి లేకుండా తీసుకున్న వారిని తీసేయాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే మూడు సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఓయూలో ఇలా నియామకమైనవారిని తొలగించారు. కానీ కాకతీయ యూనివర్సిటీలో అమలు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 16 పీరియడ్స్ వర్క్‌లోడ్ కలిగిన 30 మంది పార్ట్‌టైం లెక్చరర్లను కాంట్రాక్ట్ లెక్చరర్లుగా నియమించేందుకు కొందరు పార్ట్‌టైం లెక్చరర్ లీడర్లు రూ.అర కోటి వరకు వసూలు చేసి కేయూ వీసీకి ఇచ్చారనే ఆరోపణ అప్పట్లో దుమారం రేపింది.

Advertisement

Next Story

Most Viewed