హైదరాబాద్‌లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న కలెక్టర్లు.. భారీ షాకిచ్చేందుకు సిద్ధమైన సర్కార్?

by Gantepaka Srikanth |
హైదరాబాద్‌లో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్న కలెక్టర్లు.. భారీ షాకిచ్చేందుకు సిద్ధమైన సర్కార్?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలోనే పెద్దఎత్తున ఐఏఎస్, ఐపీఎస్‌లకు స్థానచలనం ఉంటుందని తెలుస్తోంది. పనితీరు సరిగాలేని అధికారులను తప్పించి, ఆ స్థానంలో కొత్తవారిని అపాయింట్ చేస్తారనే ప్రచారం సాగుతున్నది. జిల్లా కలెక్టర్, ఎస్పీ నుంచి మొదలు డైరెక్టర్, సెక్రెటరీల పనితీరుపై సీఎంఓ ఇప్పటికే ఓ నివేదికను రెడీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అది ముగిసిన వెంటనే బ్యూరోక్రసీని ప్రక్షాళన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారుల పనితీరుపై సీఎం అసంతృప్తితో ఉండటమే ఇందుకు కారణం. ఏసీ గదుల నుంచి బయటకు రావాలని, ఫీల్డ్‌కు వెళ్లాలని సీఎం పదే పదే చెబుతున్నా కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లు వినిపించుకోవడం లేదని, అందుకే వారిపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సెక్రెటేరియట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోరా..

బ్యూరోక్రాట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని సీఎం రేవంత్ పలుసార్లు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కానీ, ఆయన చెప్పినప్పుడు సరేనంటూ తలలూపే అధికారులు.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గురుకులాల్లో తలెత్తుతున్న సమస్యలు తెలుసుకునేందుకు రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని, నెలలో ఒకరోజు రాత్రి అక్కడే బస చేసి, పిల్లలతో చనువు పెంచుకోవాలని సూచించారు. కానీ, ఇప్పటివరకు ఒకరిద్దరు కలెక్టర్లు మాత్రమే గురుకులాలను సందర్శించారు. మెజార్టీ అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయారని ఆరోపణలున్నాయి. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ధాన్యం సేకరణ టైంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ చేసిన సూచనలను సైతం పక్కన పెట్టారని విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే పనితీరు సరిగాలేని కలెక్టర్లు, ఎస్పీలను తప్పించి వారి స్థానాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలని సీఎంఓ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఫీల్డ్ విజిట్‌కు సెక్రెటరీలు, డైరెక్టర్లు దూరం

గతంలో సెక్రెటరీలు, డైరెక్టర్లు తమ శాఖ పనుల పురోగతి తెలుసుకునేందుకు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లేవారు. అక్కడ జరిగే పనులను తనిఖీ చేసి సలహాలు, సూచనలు చేసేవారు. కానీ, ప్రస్తుతం ఆ ప్రాక్టీస్‌ను ఐఏఎస్‌లు పూర్తిగా పక్కకు పెట్టేశారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత గ్రామాల్లో పర్యటించేందుకు ఆఫీసర్లు నామోషీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓ సెక్రెటరీని సీఎం స్వయంగా పిలిచి మందలించగా ఫీల్డ్‌కు వెళ్లి ఇసుక డంపింగ్ యార్డులను పరిశీలించినట్లు సెక్రెటేరియట్‌లో చర్చ జరుగుతున్నది.

సీఎస్ మానిటరింగ్ లోపం?

సీఎం ఆదేశాల మేరకు కింది స్థాయి అధికారులు పనిచేస్తున్నారా? లేదా? అని సీఎస్ హోదాలో ఉన్న అధికారి మానిటరింగ్ చేయాలి. కానీ, ప్రస్తుతం ఆ పర్యవేక్షణ లోపించడంతోనే జిల్లా అధికారులు సీఎం ఆదేశాలను పట్టించుకోవడం లేదని చర్చ సాగుతోంది. గురుకులాలకు వెళ్లి ఒకరోజు నిద్ర చేయాలని చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి స్వయంగా మహిళా ఐఏఎస్ అధికారులను కోరారు. కానీ, ఇంతవరకు ఎవరూ కూడా గురుకులాలకు వెళ్లిన దాఖలాలు లేవు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై కలెక్టర్లు రివ్యూలు చేస్తూ, పూర్తిగా కలెక్టరేట్‌కే పరిమితం అవుతున్నారు. కానీ, ఉదయం లేదా సాయంత్రం ఒక గంటపాటు ఫీల్డ్ విజిట్‌కు వెళ్తే అనేక విషయాలను స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కామెంట్ చేశారు.

మంత్రుల మొప్పు కోసమే..

మెజార్టీ ఐఏఎస్, ఐపీఎస్‌లు జిల్లా మంత్రుల మెప్పుకోసం తీవ్రంగా ఆరాట పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాళ్లు చెప్పిన ఆదేశాలను తూచతప్పకుండా అమలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నట్లు టాక్. మంత్రి జిల్లాకు వచ్చినప్పటి నుంచి వెళ్లేవరకు వారి వెంటే తిరుగుతున్నారే తప్పా, గ్రామాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు ఫీల్డ్ విజిట్ చేయడలేదని నిఘా వర్గాలు సైతం గుర్తించాయి. కొందరు కలెక్టర్లు మాత్రం వీకెండులో హైదరాబాద్‌‌కు వచ్చి స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు విమర్శలొస్తున్నాయి.

Next Story

Most Viewed