ధరణి పోర్టల్‌లో ఆ ఆప్షన్ మాయమైంది.. వారం రోజులుగా ‘నాట్ అవేలెబుల్’!

by GSrikanth |   ( Updated:2023-02-28 23:30:44.0  )
ధరణి పోర్టల్‌లో ఆ ఆప్షన్ మాయమైంది.. వారం రోజులుగా ‘నాట్ అవేలెబుల్’!
X

ఇప్పటికే రహస్యాలమయంగా ఉన్న ‘ధరణి’ పోర్టల్ లో ఇప్పుడు ‘టిప్పన్’ ఆప్షన్ మాయమైంది. వారం రోజులుగా ‘నాట్ అవేలెబుల్’ అని చూపిస్తున్నది. వివాదాల్లేని భూములను కనుక్కోవడానికి ఉపయోగపడే ఈ టిప్పన్‌ను రద్దు చేయడంలో ఆంతర్యమేమిటని భూ చట్టాల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాల మ్యాపులు ఇప్పుడు పోర్టల్ లో కనిపించడం లేదు. పారదర్శకతకు పెద్దపీట వేస్తామంటూనే ఒక్కొక్క ఆప్షన్ ను తొలగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ‘రైట్ టు ప్రైవసీ ఆప్షన్’ ను ఉపయోగించి చాలా మంది వారికి సంబంధించిన భూముల వివరాలను రహస్యంగా ఉంచుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ ఆధారాలను మింగేస్తున్నది. వాస్తవ సమాచారాన్ని ఇతరులెవరూ తెలుసుకోకుండా ఆంక్షలు పెడుతున్నది. అత్యంత గోప్యంగా ఉంచుతున్నది. భూముల వివరాలు, డేటా మరెవరికీ తెలియకుండా రహస్యం చేస్తున్నది. రెవెన్యూ గ్రామనక్షలు (క్యాడస్ట్రల్ మ్యాప్స్) సామాన్యులకు అందకుండా చేస్తున్నది. ఏయే సర్వే నంబరులో ఎంతేసి భూమి ఉన్నది? ఆ సర్వే నంబర్లలో సబ్ డివిజన్లు ఎన్ని? ఆయా సబ్ డివిజన్లలో ఎంతేసి విస్తీర్ణం ఉన్నది? సరిహద్దుల వివరాలేమిటో అంతుచిక్కకుండా చేస్తున్నది. రెండున్నరేళ్ల క్రితం వరకు వీఆర్వో దగ్గరికి వెళ్తే 1బీ రిజిస్టర్ చూసి అన్నీ చెప్పేవారు. విలేజ్ మ్యాప్ చూపించేవాళ్లు. సరిహద్దులో ఏయే సర్వే నంబర్లు వస్తాయో వివరాలు తెలిసేది. ఇప్పుడా సమాచారాన్ని అందించేందుకు ధరణి పోర్టల్ నిరాకరిస్తున్నది. ప్రధానంగా అత్యంత ఖరీదైన భూములున్న గ్రామాల క్యాడస్ట్రల్ మ్యాపులను అప్ లోడ్ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు తప్ప అన్ని గ్రామాలకు గ్రామ నక్షలు ఉన్నాయి. అయితే చాలా రెవెన్యూ గ్రామాల డేటా తెలియకుండా దాచి పెడుతున్నారు.

రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని గ్రామాల మ్యాపులు అదృశ్యమయ్యాయి. ‘విలేజ్ డేటా నాట్ అవేలెబుల్’ అని చూపిస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం, శంషాబాద్, గండిపేట, శేరిలింగంపల్లి, మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్, శామీర్ పేట, దుండిగల్ తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల మ్యాప్స్ అప్ లోడ్ చేయలేదు. ఆయా గ్రామాల్లో వివాదాలు అధికంగా ఉన్నాయి. అలాంటి వివాదాస్పద భూములకు పరిష్కారం లభించాలంటే మ్యాప్స్ ఆధారంగా బౌండరీస్ తెలుసుకునే వీలుంది. ఎవరైనా కొనుగోలు చేయాలనుకునే వారు కూడా వివాదాలు ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని మ్యాప్స్ ఆధారంగా క్షేత్ర స్థాయి పరిశీలన చేసుకుంటే క్లారిటీ వస్తుంది. ఆ వెసులుబాటు ఇవ్వకుండా రెవెన్యూ యంత్రాంగం మరిన్ని సమస్యలకు ఆజ్యం పోసేందుకే అసలైన డేటాను పోర్టల్ లో అప్ లోడ్ చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరికొత్త సమస్యలను సృష్టిస్తున్న రెవెన్యూ యంత్రాంగానికి భూ రికార్డుల ప్రక్షాళన 20 రోజుల్లో ఎలా సాధ్యమవుతుందో అంతుచిక్కడం లేదు.

ఏ సర్వే నంబర్? ఎంత?

జిల్లా, మండలం, గ్రామం పేర్లతో క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఆప్షన్ కి వెళ్తే గ్రామనక్ష ఓపెన్ అవుతుంది. అందులో మనకు కావాల్సిన సర్వే నంబరు మీద క్లిక్ చేస్తే విస్తీర్ణం ఎంత? సబ్ డివిజన్లు ఎన్ని? ఏయే సబ్ డివిజన్ లో ఎంత విస్తీర్ణం? ఇలా వివరాలన్నీ దర్శనమిస్తాయి. సర్వే నంబర్ మొత్తం విస్తీర్ణం పక్కనే చిన్న ఫోటో గుర్తు ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ సర్వే నంబర్ టిప్పన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆ సర్వే నంబరు సరిహద్దులు కొలతలతో సహా ఉంటుంది. ఏ దిక్కున ఎన్ని గజాలు ఉందో స్పష్టంగా ఉంటుంది. దాన్ని బట్టి గజం తేడా రాకుండా భూములను కొలిచే వీలుంటుంది. ధరణి పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి సర్వే నంబర్ల వారీగా టిప్పన్స్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది. గడిచిన వారం రోజులుగా ఆ ఆప్షన్ ని తొలగించారు. డౌన్ లోడ్ అని క్లిక్ చేస్తే ‘టిప్పన్ ఈజ్ నాట్ అవేలబుల్’ అని వస్తున్నది. వివాదాల్లేని భూములను కనుక్కోవాలంటే ఈ టిప్పన్ ఎంత ఉపయోగమే ల్యాండ్ ఎక్స్పర్ట్స్ కి తెలుసు.

దాని ద్వారానే భవిష్యత్తులోనూ సర్వే లేదా సమగ్ర భూ సర్వేని నిర్వహించేది. అత్యంత ప్రాధాన్యత కలిగిన టిప్పన్ మ్యాప్స్ ని కనిపించకుండా మాయం చేయడంలో ఆంతర్యేమిటో అర్థం కావడం లేదని భూ చట్టాల నిపుణులు, రియల్టర్లు అనుమానిస్తున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం యెలిమినేడు రెవెన్యూ గ్రామంలో రియల్ ఎస్టేట్ బూమ్ తో భూముల విలువలు పెరిగాయి. అక్కడ కొంత కాలం క్రితమే వెంచర్లు వేసి ప్లాట్లు అమ్మేశారు. కానీ నేటికీ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా ధరణి రికార్డుల్లో కొనసాగుతున్నాయి. వాటిని బౌండరీస్ తెలియడం ద్వారా ఆ వివాదాస్పద భూముల జోలికి వెళ్లకుండా ఉండొచ్చు. అయితే ధరణి పోర్టల్ లో టిప్పన్ డౌన్ లోడ్ కావడం లేదు. ఇలా అనేక వివాదాస్పద భూములు కలిగిన గ్రామాల్లో క్యాడస్ట్రల్ మ్యాప్స్ అప్ లోడ్ చేయలేదు. ఇప్పుడేమో టిప్పన్స్ కూడా డౌన్ లోడ్ కావడం లేదు. ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సర్వేయరైనా ఈ మ్యాప్ ఆధారంగానే సర్వే చేస్తారు. ఈ మ్యాప్ లో కచ్చితత్వం ఉంటుంది. పండ్ల తోటలు, కూరగాయల సాగుకు డ్రిప్ వేయాలంటే సంబంధిత ఆఫీసుల్లో ఈ మ్యాప్ ని సబ్ మిట్ చేయాల్సి ఉంది.

అనుమతి ఉత్తదేనా?

ధరణి పోర్టల్ ద్వారా ఆన్‌ లైన్ ఫార్మాట్‌లో భూమి రికార్డులను చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పౌరులను అనుమతిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీనికి అదనంగా ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోనూ అందుబాటులో ఉన్న భూ మ్యాప్‌లను అందిస్తుంది. గ్రామాల కాడాస్ట్రల్ మ్యాప్‌ లను కూడా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్‌సైట్ ఉపయోగించి పొందొచ్చని ప్రకటించారు. ధరణి పోర్టల్ వెబ్‌ సైట్‌ https://dharani.telangana.gov.in/gis/ కి వెళ్లి జిల్లా, డివిజన్, మండలం, గ్రామం సెలెక్ట్ చేయగానే క్యాడస్ట్రల్ మ్యాప్ వస్తుంది. సర్వే నంబరుపై క్లిక్ చేస్తే దాని పూర్తి విస్తీర్ణం కనబడుతుంది. దాని పక్కనే ఉన్న ఫోటో గుర్తుపై క్లిక్ చేస్తే టిప్పన్ డౌన్ లోడ్ కావడం లేదు. ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామంటూనే పాత ఆప్షన్లను తొలగించడం విస్మయానికి గురి చేస్తున్నది. ధరణి పోర్టల్ లో ఇప్పటికీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి గ్రామనక్ష లేదు. మూడు నెలల్లోనే రూపొందిస్తామన్న ప్రభుత్వానికి మూడేండ్లవుతున్నా ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది. దీన్ని బట్టి గ్రామనక్షకు ఎంత విలువ ఉన్నదో, దాని తయారీ వెనుక ఎంత శ్రమ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా టిప్పన్ డౌన్ లోడ్ సదుపాయాన్ని కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అంతా రహస్యమే

ధరణి పోర్టల్ లో తమ భూముల వివరాలు కనిపించకుండా దాచుకునే వ్యవస్థను రూపొందించారు. ఎవరైనా రైట్ టూ ప్రైవసీ ఆప్షన్ కింద సమాచారాన్ని ఇతరులకు కనిపించకుండా చేయొచ్చు. ఇప్పుడీ ఆప్షన్ ని పెద్దలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా రైట్ టూ ప్రైవసీ ఆప్షన్ ని వినియోగించుకునే వారి సంఖ్య పెరిగింది. వేలాది మంది పెద్దలు వారు కొనుగోలు చేసిన భూముల వివరాలేవీ కనిపించకుండా చేశారు. ప్రధానంగా వివాదాస్పద భూములను కొనుగోలు చేయగానే అవి ఎవరి పేరిట ఉన్నాయో సామాన్యులెవరూ తెలుసుకోకుండా దాచి పెడుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలతో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ రైట్ టూ ప్రైవసీ ఖాతాల సంఖ్య పెరిగింది. వీరిలో ఎక్కువ మంది అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు చేసిన భూములే ఉన్నాయి. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఈ ఆప్షన్ ని వాడుకుంటున్నారు. రాజకీయ నాయకుల భాగస్వామ్యం కలిగిన వివిధ కంపెనీలు, రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా రైట్ టూ ప్రైవసీ కింద భూములను దాచి పెట్టాయి. ఇక ధరణి పోర్టల్ పారదర్శకతకు పెద్ద పీట వేస్తుందన్న హామీకి పాతరేసినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

Advertisement

Next Story