గొల్ల, కురుమలకు శుభవార్త.. 2వ విడత గొర్రెల పంపిణీకి ముహుర్తం ఫిక్స్!

by Satheesh |
గొల్ల, కురుమలకు శుభవార్త.. 2వ విడత గొర్రెల పంపిణీకి ముహుర్తం ఫిక్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 9 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ చేపడుతున్నామని, 3 లక్షల 50వేల మందికి 75లక్షల గొర్రెలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమీపంలోని గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మార్గదర్శకంలో గొర్రెల పంపిణీ కార్యక్రమంను ప్రారంభిస్తున్నామన్నారు.

తెలంగాణ సంక్షేమ సంబరాలకు తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చిన నేపథ్యంలో గొర్రెల పంపిణీ పథకంను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గొర్రెల పంపిణీ లబ్ధిదారులందరూ వారి వారి గ్రామాల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా యాదవ కురుమలకు కేసీఆర్ రూ.12 వేల కోట్లు కేటాయించి 7.31 లక్షల మంది లబ్ధిదారుల ఆర్థిక చేసేందుకు ప్రవేశపెట్టిన పథకం గొర్రెల పంపిణీ పథకం అని స్పష్టం చేశారు.

మొదటి విడతలో 3.93 మంది లబ్ధిదారులకు రూ.5,100కోట్లతో 84.74 లక్షల గొర్రెల పంపిణీ చేశామన్నారు. గొర్రెల లభ్యత, వాటి రవాణా సౌకర్యం, ఇన్సూరెన్స్, మెడికల్, దాణా కిట్టు అందజేయడం జరుగుతుందన్నారు. 33 జిల్లాల్లో అధికార యంత్రాంగం రెండో విడత గొర్రెల పంపిణీపై గొర్రెల పెంపక దారులకు అవగాహన సదస్సులు ఇప్పటికే నిర్వహించినట్లు తెలిపారు.

గొర్రెల పంపిణీ పథకం నిరంతర ప్రక్రియ అని, చివరి లబ్ధిదారుడికి ఈ పథకం ద్వారా గొర్రెల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. రెండో విడత ఇప్పటివరకు 33 జిల్లాల్లో 72,612 మంది లబ్ధిదారుడి వాటాగా డిడి రూపంలో చెల్లించారన్నారు. లబ్ధిదారులందరికీ విడుతల వారీగా ఒక్కో యూనిట్‌కు 1.75 లక్షల ఖర్చుతో విలువచేసే 20 గొర్రెలు ఒక పొట్టేలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే అందజేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిపై ప్రజలంతా సంబురాలను ఊరువాడ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో దశాబ్ద కాలంలోనే శతాబ్ది అభివృద్ధి జరుగడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని అన్నారు. ఈ పదేళ్ల కాలాన్ని తెలంగాణ స్వర్ణయుగంగా అభివర్ణించారు. రెండో విడుత గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి యాదవ, కురుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed