అలయ్ బలయ్ వేదికపై మూడు ప్రధాన పార్టీలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-13 15:13:37.0  )
అలయ్ బలయ్ వేదికపై మూడు ప్రధాన పార్టీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతి ఏటా దసరా పండుగ మరుసటి రోజున నిర్వహించే ‘అలయ్ బలయ్’ వేడుకకు ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నామని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, పార్టీల అధినేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. ఆ ప్రకారమే నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆదివారం జరిగిన కార్యక్రమం వివిధ పార్టీల నేతలకు వేదికగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రతినిధులతో పాటు తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ (పీసీసీ చీఫ్) మహేశ్‌కుమార్ గౌడ్, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డి హాజరుకాగా బీఆర్ఎస్ తరఫున మాత్రం ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైర్హాజరయ్యారు. ఆ పార్టీ తరఫున మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాసగౌడ్ తదితరులు అటెండ్ అయ్యారు.

మూడు ప్రధాన పార్టీల నేతలు హాజరైనా వారి మధ్య పెద్దగా సంభాషణలు జరగలేదు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరైన ‘అలయ్ బలయ్’ ప్రోగ్రామ్‌కు వివిధ రాష్ట్రాల గవర్నర్లు కూడా వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ప్రసంగంలో నాయకుల ప్రసంగాల్లో, భాషలో మార్పు రావాలని, పార్టీలు విమర్శించుకుంటున్న విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పోన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు. రాజకీయాల్లో భాష ముఖ్యమేనని, వేరేవాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలన్నది నిజమని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడకుండా స్వీయ నియంత్రణ అవసరమని, తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మాట్లాడేలా దత్తాత్రేయ చొరవ చూపాలన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాత్రం ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసి ఆ పార్టీ తరఫున కూడా ఎవ్వరూ హాజరు కాకుండా ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనను పదేండ్ల పాటు జైల్లో పెట్టారని, దాదాపు 90% అంగవైకల్యంతో బాధపడుతున్నా ఆయనకు కనీస సౌకర్యాలను ఇవ్వడానికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదని, ఫలితంగా ఆయన ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయని అన్నారు. “మీరు పెద్దమనిషి... అయితే చివరికి మీరు అతని మరణానికి దారితీసిన అదే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు... మీ ఆహ్వానానికి ధన్యవాదాలు... కానీ నిరసనగా మీరు నిర్వహించే కార్యక్రమానికి నేను హాజరు కాలేను..” అని బండారు దత్తాత్రేయను ఉద్దేశించి చేసిన ఒక ప్రకటనలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed