పని చేయని వారు పదవులు వదులుకోండి.. ఓబీసీ మోర్చా కార్యక్రమంలో లక్ష్మణ్ హెచ్చరిక

by Mahesh |
పని చేయని వారు పదవులు వదులుకోండి.. ఓబీసీ మోర్చా కార్యక్రమంలో లక్ష్మణ్ హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనని వారు తమ పదవులను ఇతరులకు ఇచ్చేయాలని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం పని చేసేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని ఎవరైనా పార్టీ కార్యక్రమాలు చెయ్యలేని నాయకులు పదవులను వేరే వాళ్ళకి ఇచ్చేయాలని హెచ్చరించారు. సోమవారం కూకట్ పల్లి లో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు ఆలె భాస్కర్, ఓబీసీ జాతీయ మీడియా సెల్ నాయకులు రంగా కిరణ్‌తో పాటు ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ నేతలకు దిశానిర్దేశం చేశారు. 'పల్లె పల్లెకు ఓబీసీ - ఇంటింటికి బీజేపీ' నినాదంతో ఓబీసీ మోర్చా తెలంగాణలో లక్ష కుటుంబాలను కలుసుకోబోతోందని చెప్పారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు బీసీల కోసం మోడీ సర్కార్ చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందేనని నేతలకు సూచించారు.

దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదని గడిచిన 50 ఏళ్లు నెహ్రూ కుటుంబం ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకున్నదని ధ్వజమెత్తారు. మోడీ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా వెనుకబడిన కులాలకు అండగా నిలుస్తున్నారని, చిన్న కులాలు చిన్న రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఓబీసీలకు నీట్, నవోదయ, సైనిక్ స్కూల్ లో రిజర్వేషన్లు ఇచ్చింది మోడీనే అన్నారు.

రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని, కేసీఆర్ మనవడికి వయసు లేక బతికిపోయామని, ఒక వేళ అతనికి పదవులు పొందే అర్హత వయసు గనుక ఉంటే బుడ్డోడు కూడా ఎమ్మెల్యే అయ్యేటోడని సెటైర్లు వేశారు. మోడీ, యోగి కుటుంబాలను చూడండి వాళ్ళ స్థితి గమనించాలన్నారు. మోడీ మూడున్నర కోట్ల ఇండ్లు కట్టించి ఇచ్చాడని బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో ఉప్పు, పప్పు, నూనె, చింతపండు కూడా కలిపి యోగి సర్కార్ ప్రజలకు అందజేస్తుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed