Congress: గత పదేళ్లలో కేసీఆర్ పంచిపెట్టింది ఇదే.. బీఆర్ఎస్‌కు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్

by Ramesh Goud |
Congress: గత పదేళ్లలో కేసీఆర్ పంచిపెట్టింది ఇదే.. బీఆర్ఎస్‌కు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రుణాన్ని పదింతలు పెంచిందని, తెలంగాణ ప్రజలకు అప్పులు, కల్వకుట్ల కుటుంబానికి ఆస్తులు పెరిగాయని తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కేవలం 8 నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పులు అని బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇస్తూ.. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ సందర్భంగా కేసీఆర్ గత పదేళ్ళలో.. తెలంగాణ ప్రజలకు అప్పులు, కల్వకుంట్ల వారసులకు ఆస్తులు పంచి పెట్టిండని విమర్శలు చేశింది. తెలంగాణ ఆవిర్భావం నాటికి 75,577 కోట్ల అప్పులున్నాయని, అవి 2021-22 నాటికి అవి 2.83 లక్షల కోట్లకు చేరాయని కేంద్రం తెలిపినట్లు పేర్కొంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు లక్షా 50 వేల కోట్లు అప్పు తీసుకున్నాయని, 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు లక్షా 30 వేల కోట్లని వివరించినట్లు తెలిపింది.

అలాగే 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ రాష్ట్రానికి 4,33,817.6 కోట్ల అప్పు ఉన్నట్లు కేంద్రం వెల్లడించిందని చెప్పింది. ఇక 2014 నుండి తెలంగాణలో భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం రాష్ట్రం యొక్క రుణాన్ని భారీగా పెంచిందని, 2014లో సుమారు రూ.72,658 కోట్ల నుంచి 2024 నాటికి సుమారు రూ.7.11 లక్షల కోట్లు పెరిగిందని, ఈ కాలంలో రాష్ట్ర రుణం పదింతలు పెరిగిందని కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేస్తూ.. కేవలం 8 నెలల్లో రేవంత్‌ సర్కార్ చేసిన అప్పు 50 వేల కోట్లని, తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మారుస్తుందని తెలిపింది. ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు. ప్రజా సంక్షేమమూ లేదు అంటూ.. నిమిషానికి అప్పు: రూ.14.5 లక్షలు, గంటకు: రూ.8.7 కోట్లు, రోజుకు: రూ.210 కోట్లు, నెలకు: రూ.6,264 కోట్లు అని వివరించింది. ఇక ఇదే ధోరణి కొనసాగితే, ఐదేండ్లు ముగిసే నాటికి కాంగ్రెస్‌ సర్కారు చేసే అప్పు 3.75 లక్షల కోట్లు దాటనుందని ఎక్స్ లో పోస్ట్ చేసింది.

Advertisement

Next Story