TSPSC పేపర్ లీక్: నిందితుడు ప్రవీణ్ అసలు గ్రూప్-1 ఎగ్జామే రాయలేదంట..!

by Javid Pasha |   ( Updated:2023-03-19 15:22:31.0  )
TSPSC పేపర్ లీక్: నిందితుడు ప్రవీణ్ అసలు గ్రూప్-1 ఎగ్జామే రాయలేదంట..!
X

దిశ, వెబ్ డెస్క్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఊహించని ఈ ఘటనతో నిరుద్యోగులు ఒక్కసారిగా ఆందోళనకు, ఆగ్రహానికి గురయ్యారు. ఇక పేపర్ లీక్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్, రాజశేఖర్, రేణుక తదితరులను ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఓ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఆ విషయం ఏంటంటే.. నిందితుడు ప్రవీణ్ అసలు గ్రూప్-1 పరీక్షే రాయలేదంట. కానీ ఇప్పటి వరకు గ్రూప్-1 పరీక్షలో ప్రవీణ్ కు 103 మార్కులు వచ్చినట్లు.. పేరు వద్ద డబుల్ బబ్లింగ్ చేయడం వల్ల అతడి పేపర్ తిరస్కరణకు గురైనట్లు టీఎస్పీఎస్సీ అధికారులు, పోలీసులు చెబుతూ వచ్చారు. కానీ సిట్ విచారణలో తాను అసలు గ్రూప్-1 పరీక్షే రాయలేదని నిందితుడు ప్రవీణ్ ఒప్పుకున్నట్లు సమాచారం. మరి అతడు గ్రూప్-1 పరీక్ష రాయనప్పుడు మీడియాలో సర్క్యులేట్ అయిన ఆ ఓఎమ్ఆర్ షీట్ ఎవరిది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఎస్పీఎస్సీ నిబంధనల ప్రకారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పని చేసే సిబ్బంది ఎవరైనా గ్రూప్స్ పరీక్ష రాయాలంటే పరీక్షకు కొన్ని నెలల ముందే సెలవులో ఉండటం గానీ.. లేక వేరే కార్యాలయానికి బదిలీపై వెళ్లడం గానీ చేయాలి. ఒకవేళ అదే కార్యాలయంలో ఉంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రవీణ్ విషయంలో అలాంటివేమీ జరగలేదు. అతడు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని స్వయంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డే చెప్పారు. పోనీ అనుమతి తీసుకొనే పరీక్ష రాసాడనుకుంటే.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 103 మార్కులు సాధించడం ఎలా సాధ్యమవుతుంది అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఒకవేళ ఆయనకున్న అపారమైన మేధో సంపత్తితోనే అన్ని మార్కులు సాధించాడని అనుకుంటే.. అంత తెలివి ఉన్నవాడు ఓఎమ్ఆర్ షీట్ లో తప్పుడు బబ్లింగ్ ఎలా చేస్తాడని నిరుద్యోగులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు.

ఒకవేళ పేపర్ లీక్ కు పాల్పడే పరీక్షకు హాజరయ్యాడని భావిస్తే.. పరీక్షకు ముందు అంత ‘నెట్ ప్రాక్టీస్’ చేసినవాడు పేరు విషయంలో ఎందుకు తప్పు చేస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తే ఈ వ్యవహారం వెనుక పెద్ద పెద్ద వాళ్ల హస్తం ఉందని, వాళ్లందరిని తప్పించడానికే టీఎస్పీఎస్సీ అధికారులు ప్రవీణ్, రాజశేఖర్, రేణుక వంటి వాళ్లను బలిపశువులు చేస్తున్నారనే సందేహాలు తలెత్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్లు లీకయ్యాయని మీడియాకు తెలిసిన కొన్ని గంటల తర్వాత ప్రవీణ్ కు సంబంధించిన గ్రూప్-1 ఓఎమ్ఆర్ షీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అసలు ఈ ఓఎమ్ఆర్ షీట్ ను ఎవరు మీడియాకు రిలీజ్ చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పేపర్ల లీక్ వ్యవహారంలో పెద్ద తలలను కాపాడేందుకే టీఎస్పీఎస్సీ అధికారులు ప్రవీణ్ తో అప్పటికప్పుడు ఓఎమ్ఆర్ షీట్ ను నింపించి.. పేరు వద్ద డబుల్ బబ్లింగ్ చేయించి పేపర్ ఇన్వాలిడ్ అయ్యేటట్లు చేశారని, వాళ్లే అనంతరం అతడి చేత మీడియాకు లీక్ చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్ లీక్ కు పాల్పడిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ విషయంలో నిజం ఎంతో సిట్ దర్యాప్తులో తేలాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed