మెడికల్ ఎథిక్స్‌కు తూట్లు.. రాష్ట్రంలో ఘోరంగా పరిస్థితి!

by GSrikanth |   ( Updated:2022-09-02 05:34:29.0  )
మెడికల్ ఎథిక్స్‌కు తూట్లు.. రాష్ట్రంలో ఘోరంగా పరిస్థితి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసే వైద్యుల కొరత తెలంగాణను వేధిస్తున్నది. ముఖ్యంగా 'డబుల్ పంచర్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్లు' రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మాత్రమే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడ సర్జరీలు చేయాలన్నా వీరే శరణ్యం. ఇటీవల వీరిలో ఓ సర్జన్ రిటైర్డ్ అయినట్లు సమాచారం. కానీ ఆ స్థానంలో ఇప్పటి వరకు మరొకరిని భర్తీ చేయలేదు. కు.ని సర్జరీలు చేసుకునే మహిళల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. ప్రభుత్వం డాక్టర్ల సంఖ్యను పెంచడం లేదు. ఉన్నోళ్లతోనే మొక్కుబడిగా నెట్టుకొస్తున్నట్లు వ్యవహరిస్తున్నది. ఆ డాక్టర్ల కూడా వర్క్ లోడ్​పెరగడంతో సర్జరీలను స్పీడ్‌గా చేసేస్తున్నారు. వందల మందికి ఒకేసారి సర్జరీలు చేస్తున్నారు. దీంతో బాధితులను పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసే పరిస్థితుల్లో డాక్టర్లు లేరు. తద్వారా బాధితులకు వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి. ఇటీవల ఇబ్రహీంపట్నంలో ఇలాంటి నిర్లక్ష్యంతోనే బాధితులకు ఇన్​ఫెక్షన్లు సోకాయి.

టార్గెట్లతోనే..

ప్రభుత్వం కుటుంబ నియంత్రణ సర్జరీలపై టార్గెట్​ఇస్తున్నది. క్యాంపులకు ఇంత మందిని తీసుకురావాలి? అంటూ అంతర్గతంగా హుకూం జారీ చేస్తున్నది. దీంతో గ్రామాల్లో ఉండే ఆశ కార్యకర్తలు, ఏఎన్​ఎంలు సర్జరీలు లేకుండా ఉన్నోళ్లను క్యాంపులకు తరలిస్తున్నారు. అందరూ ఒకేసారి రావడంతో ఆ క్యాంపులో గందరగోళం పరిస్థితులు నెలకొంటున్నాయి. పైగా మహిళలే స్వచ్ఛందంగా వస్తున్నారని అధికారులు పైకి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారు. వాస్తవంగా ఒక్కో క్యాంపులో ఒక రోజు ఒక డాక్టర్​కేవలం 30 సర్జరీలు మాత్రమే చేయాలన్నది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. వందల మంది ఒకేసారి రావడంతో సర్జరీలు చేయడం సవాల్‌గా మారింది. మెడికల్ ఎథిక్స్‌ను ఉల్లంఘిస్తూ ఆపరేషన్లు చేస్తున్నారు. దీంతో బాధితులంతా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను చవిచూడాల్సి వస్తున్నది.

రెట్టింపు స్థాయిలో సర్జరీలు..

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ నిర్లక్ష్యంతో కు.ని సర్జరీల్లో సమస్యలు వస్తున్నాయి. డాక్టర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉన్నా, ఆ దిశగా అడుగులు వేయడం లేదు. 2022–23 లో రాష్ట్ర వ్యాప్తంగా 111 క్యాంపులను ఏర్పాటు చేశారు. 6,432 మందికి డీపీఎల్​(పిల్లలు పుట్టకుండా చేసే సర్జరీ) చేశారు. అంటే ఒక్కో డాక్టర్ ​ఒక క్యాంపులో సగటున 60 మందికి సర్జరీలు చేశారు. నిబంధనల ప్రకారం 30 మందికి మాత్రమే చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ అధికారులు, డాక్టర్లు ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా టార్గెట్లు పూర్తి చేసేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. మరోవైపు 2021–22లో 502 క్యాంపులను ఏర్పాటు చేసి 24,233 మందికి చేశారు. అంటే ఒక డాక్టర్​ ఒక రోజులో సుమారు 45 నుంచి 48 సర్జరీలు చేసినట్లు స్పష్టంగా అర్థం అవుతున్నది. ఇక ఇబ్రహీం పట్నంలోనూ అదే జరిగింది. ఒక డాక్టర్​ ఒక రోజులో 34 మందికి చేశారు. ఈ కారణంగానే సమస్య వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.

Also Read : బరువు తగ్గట్లేదా.. కారణం ఇదే!

Advertisement

Next Story

Most Viewed