ప్రభుత్వ హాస్టళ్లకు, పాఠశాలలకు నాణ్యత లేని సన్నబియ్యం సరఫరా..!

by Javid Pasha |
ప్రభుత్వ హాస్టళ్లకు, పాఠశాలలకు నాణ్యత లేని సన్నబియ్యం సరఫరా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో 28,632 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా సుమారు 25 లక్షల మంది విద్యార్థులకు, అలాగే 4237 ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లోని 9 లక్షల 65 వేల మంది విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నారు. ఇందుకోసం ఏడాదికి 1.50 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నామని గతంలో చైర్మన్ తెలిపారు. బియ్యం నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని గతంలో పలుమార్లు అన్నారు. కానీ ప్రభుత్వ హాస్టళ్లకు, పాఠశాలలకు పంపించే సన్నబియ్యంలో నాణ్యత లేదని పలువురు సివిల్ సప్లయిస్ అధికారులకు ఫిర్యాదులు చేశారు. గతంలో కూడా కొన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో బియ్యంలో నాణ్యత లేకపోవడంతో అన్నం సరిగ్గ ఉడకకపోవడం.. దీంతో విద్యార్థులు పస్తులుండడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనల కారణం.. నాణ్యత లేదని వరుస ఫిర్యాదుల కారణంతో సివిల్ సప్లయిస్ అప్రమత్తమయ్యింది. ముఖ్యంగా బియ్యం సేకరణ పరీక్షల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, పరిమితికి మించి పరీక్షలు చేయడం వంటి కారణాల వల్లే సమస్య ఏర్పడిందని సివిల్ సప్లై సంస్థ గుర్తించింది. విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం నిర్ధారణ చేసుకుంది.

మిల్లర్లు, ఉద్యోగులు నిబంధనలు పాటించాలి

సన్న బియ్యం సేకరణలో నాణ్యత ప్రామాణాలు పాటించని 12 మంది ఔట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లను సంస్థ చైర్మన్ తొలగించారు. ఈ నేపథ్యంలో శనివారం సివిల్ సప్లై సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, జీఎం మార్కెటింగ్, జీఎం ప్రొక్యూర్‌మెంట్, డీజీఎం పీడీఎస్‌తో పాటు ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌ఆర్‌కే సన్నబియ్యంలో కీలక పాత్ర పోషిస్తున్న 96 మంది రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్లు, రిటైర్డ్ ఎఫ్సీఐ/సీఎస్‌సీ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. సన్నబియ్యం నాణ్యతపై వరుస ఫిర్యాదులు వచ్చాయని చైర్మన్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ లోపాలపై సీరియస్ గా స్పందించారన్నారు. 12 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించమన్నారు. ఉద్యోగులు, రైస్ మిల్లర్లు తమ తప్పుడు కార్యకలాపాలను సరిదిద్దుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని హెచ్చరించారు.

నిరుపేదల పిల్లలకు పోషకాహారం అందించడమే లక్ష్యం

ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది నిరుపేదల పిల్లలు చదువుతున్నారని చైర్మన్ తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పోషకాహార లోపం, రక్తహీనతతో వారి శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తున్నందున పాఠశాలలకు బలవర్ధకమైన సన్నబియ్యం అందించడం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, హాస్టళ్లు, సాంఘిక సంక్షేమ సంస్థలకు సంవత్సరానికి 65 వేల మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యాన్ని కార్పొరేషన్ సేకరిస్తోందని అన్నారు.


Advertisement

Next Story

Most Viewed