జీహెచ్ఎంసీలో మూగబోయిన ప్రజావాణి.. ముచ్చటగా మూడేళ్లు

by Hamsa |   ( Updated:2023-05-24 04:13:22.0  )
జీహెచ్ఎంసీలో మూగబోయిన ప్రజావాణి.. ముచ్చటగా మూడేళ్లు
X

దిశ, సిటీబ్యూరో : స్వరాష్ట్రం, స్వపరిపాలనలో జీహెచ్ఎంసీ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమైక్య పాలనలో నైనా కనీసం ప్రజాసమస్యలు స్వీకరించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ తర్వాత 2016లో స్వపరిపాలనలో జీహెచ్ఎంసీలో మొట్టమొదటి పాలకమండలి కొలువుదీరిన తర్వాత తూతూమంత్రంగా ప్రజావాణి నిర్వహించి, ఇపుడది మూగబోయి ముచ్చటగా మూడేళ్లు గడిచింది. మరో వైపేమో ఫిర్యాదులు పట్టుకుని జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదలుకుని ప్రధాన కార్యాలయం వరకు తిరిగినా, కనీసం పట్టించుకునే వారే కరువయ్యారని మహానగర వాసులంటున్నారు.

కరోనా తర్వాత 2020 డిసెంబర్‌లో జీహెచ్ఎంసీలో కొత్తపాలక మండలి కొలువుదీరినప్పటికీ ఆ తర్వాత 2021 ఫిబ్రవరిలో మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి తన ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా 2022 ఫిబ్రవరిలో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఇకపై నుంచి ప్రజాసమస్యల స్వీకరణకు తానే ప్రతివారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించి, ఆమె కూడా కార్యక్రమ నిర్వహణను మర్చిపోయారంటే మహా నగరవాసుల సమస్యలంటే జీహెచ్ఎంసీ పాలకమండలి పెద్దలకు, అధికారులకు ఎంత నిర్లక్ష్యమో అంచనా వేసుకోవచ్చు. తమ సమస్యలను చెప్పుకునేందుకు కనీసం తాము గెలిపించుకున్న ప్రజాప్రతినిధులు, బల్దియా ఆఫీస్ లో అధికారులు సైతం అందుబాటులో లేకుండా తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.

ఆరంభ శూరత్వమేనా?

ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించిన జీహెచ్ఎంసీ కొద్ది నెలల క్రితం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, బస్తీ కమిటీలను కాంటాక్ట్ విత్ ఆర్ డబ్ల్యూ ఏ కార్యక్రమం పేరిట ప్రజా సమస్యలను నేరుగా వారి మధ్యకు వెళ్లి తెలుసుకుని పరిష్కరించాలని సరికొత్త కార్యక్రమానికి తెరదీసినా, అది కేవలం ఆరంభ శూరత్వం అయింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొత్తలో కేవలం మేయర్, డిప్యూటీ మేయర్లు మాత్రమే తమ డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమా అనిపించేశారు. బంజారాహిల్స్ డివిజన్‌లో మేయర్ విజయలక్ష్మి, తార్నాక డివిజన్‌లో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్పొరేటర్ తమ డివిజన్‌లో నిర్వహించాలని పిలుపునిచ్చినా, అన్ని పార్టీల కార్పొరేటర్ల మాట దేవుడెరుగు కానీ కనీసం అధికార బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ప్రజా సేవకులమని చెప్పుకునే ఈ ప్రజాప్రతినిధులకు ప్రజాసమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధి తేలిపోయిందని నగరవాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: మేయర్ దత్తత ఉత్తిదేనా? ఈర్ల చెరువులో కానరానీ అభివృద్ధి..

Advertisement

Next Story