రాష్ట్ర మంత్రి అండతో తతంగం.. అక్షరాలా ఆ భూమి విలువ రూ.300 కోట్లు!!

by GSrikanth |   ( Updated:2022-09-08 04:23:14.0  )
రాష్ట్ర మంత్రి అండతో తతంగం.. అక్షరాలా ఆ భూమి విలువ రూ.300 కోట్లు!!
X

అంగబలం, అర్థబలం, రాజకీయ అండతో పనులు చకచకా జరిగిపోయాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోలేదు. ధరణి రికార్డుల్లో విక్రయదారుల పేర్ల మీద భూమి లేకున్నా పని జరిగింది. పీవోబీలో లాకింగ్ అలా వెళ్లిపోయింది.. శరవేగంగా మ్యూటేషన్ ప్రక్రియ సాగింది. ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. రాష్ట్ర రాజధాని శివారులోని అబ్ధుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారంలో..! 84 ఎకరాల భూమి చేతులు మారింది. ఈ జాగా విలువ అక్షరాలా రూ. 300 కోట్లు..! ఈ పనులన్నీ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి కను సన్నల్లో సాగినట్టు తెలుస్తున్నది. ఉమ్మడి ఏపీలోని మాజీ మంత్రి సైతం చక్రం తిప్పినట్టు సమాచారం.

దిశ, తెలంగాణ బ్యూరో: అది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తట్టి అన్నారం గ్రామం.. ఇక్కడి 84 ఎకరాల భూమిపై చాలా కాలంగా కేసులు నడుస్తున్నాయి. అయినా ఆ భూమి మ్యుటేషన్ అలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ జాగా విలువ అక్షరాలా రూ. 300 కోట్లు..! సదరు స్థలాన్ని తాము కొనుగోలు చేశామంటూ ఓ బడా రియల్ ఎస్టేట్ సంస్థ అర్జీ పెట్టుకోగానే మ్యూటేషన్ జరిగిపోయింది. ఈ స్థలంపై హైకోర్టులో పలు కేసులు నడుస్తున్నాయి. రెవెన్యూ అధికారుల దగ్గర పదుల సంఖ్యలో ఫిర్యాదులు, అర్జీలు పెండింగులోనే ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి అమ్మోద డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ అనే కంపెనీకి ఎలా కట్టబెడతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం రెవెన్యూ రికార్డులను పరిశీలించకుండా, గతంలో జారీ చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా మ్యుటేషన్ చేయడంపై గమనార్హం. ఈ తతంగం వెనుక రాష్ట్ర మంత్రి ఒకరి హస్తం ఉందని తెలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన ఏపీ నేత ప్రమేయమూ ఉందంటున్నారు బాధితులు. అందుకే తమ దరఖాస్తులన్నీ బుట్టదాఖలు చేశారని, అత్యంత విలువైన భూమిని ఏకపక్షంగా సదరు కంపెనీకి రాసిచ్చారంటున్నారు. తాసిల్దార్, ఆర్డీవో నివేదికలనూ పరిగణనలోకి తీసుకోకుండా.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మ్యుటేషన్ చేశారని ఆరోపిస్తున్నారు.

ధరణితో కష్టం

ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా సాధ్యమేనని స్పష్టమవుతున్నది. అధికారులు తలచుకుంటే ఏమైనా చేయొచ్చునని రూఢీ అవుతున్నది. తాజాగా తట్టిఅన్నారం ఇష్యూ కూడా మరోసారి నిరూపించింది. ఆ ప్రాంతంలో సదరు భూములపై అనేక వివాదాలు ఉన్నాయని అందరికీ తెలుసు. పైగా మూడు వర్గాలు హక్కుల కోసం పోరాడుతున్నాయి. తారస్ హోమ్స్ అనే కంపెనీ తాము కొన్నామంటున్నది. మరోవైపు నాలుగు వెంచర్లు చేస్తే ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఉన్నారు. ఈ అంశాలన్నింటినీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన అమ్మోద డెవలపర్స్ పేరిట మ్యూటేషన్ చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది చర్చనీయాంశంగా మారింది.

రికార్డుల్లో మద్ది ఫ్యామిలీ

– రంగారెడ్డి జిల్లా ప్రస్తుత అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం రెవెన్యూ పరిధిలోని సర్వే నం.108 లో 18.23 ఎకరాలు, 109 లోని 21.22 ఎకరాలు, 110 లోని 19.15 ఎకరాలు, 111లోని 11.19 ఎకరాలు .. మొత్తం 73.30 ఎకరాలు పట్టా భూమి అని చెస్సాలా 1955–58 లో స్పష్టంగా ఉంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులూ ఉన్నాయి. అదంతా మద్ది సత్యనారాయణరెడ్డిదిగా ధ్రువీకరించారు. ఆ తర్వాత వారి వారసులుగా మద్ది భాగ్యమ్మ, వెంకటమ్మ(జ్యోతి), మద్ది శ్రీకాంత్ రెడ్డిని గుర్తించి సక్సెషన్ చేస్తూ 1998 లో ఉత్తర్వులు జారీ చేశారు.

– 1950లో జమాబందీలో ప్రభుత్వానికి రూ.394 చెల్లించడం ద్వారానే మద్ది సత్యనారాయణరెడ్డికి సంక్రమించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1954 నుంచి ప్రస్తుత పహాణీల వరకు అన్ని రెవెన్యూ రికార్డుల్లో వీళ్లే హక్కుదారులుగా ఉన్నారు.

– 2002 జనవరి 25న హక్కుదారులంతా తారస్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి ఏజీపీఏ చేశారు. 2004 అక్టోబరు 20న ఆ ఏజీపీఏని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరికీ విక్రయించలేదని బాధితులు చెబుతున్నారు.

– ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లో అమ్మోద డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి మద్దిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు విక్రయించినట్లుగా ఉంది. అది కూడా ఆగస్టు 30న అని రికార్డులు చెబుతున్నాయి. నిజానికి తాము ఎవరికీ తమ భూమిని విక్రయించలేదని వారు వాదిస్తున్నారు.

మాదేనంటున్న తారస్ కంపెనీ

అదే గ్రామంలో సర్వే నం.60, 65, 66, 70, 79, 85, 88, 89, 92, 96, 97, 99, 105, 109 లోని 145.05 ఎకరాలు ఖమరున్నీసా బేగం కుటుంబీకులు వాదిస్తున్నారు. ఓఎస్ నం.887/1987 ద్వారా డిక్రీ పొందినట్లు చూపిస్తున్నారు. 2001 లో వాళ్లు కూడా మ్యుటేషన్ ఆర్డర్ పొందినట్లు సమాచారం. ఇవన్నీ అక్రమాలు అంటూ తారస్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ జిల్లా కలెక్టర్ కి అర్జీ పెట్టుకున్నది. తాము పట్టాదారుల నుంచి ఏనాడో కొన్నామని పేర్కొన్నారు. అలాగే 2002 లో వారసుల నుంచి తాము కొనుగోలు చేశామంటూ కే ప్రతాప్ రెడ్డి చెబుతున్నారు. అందుకే అమ్మోద డెవలపర్స్ పేరిట ధరణి పోర్టల్ లో రికార్డులు మార్చేందుకు కుట్ర సాగుతుందని ఆరోపించారు. తమ కంపెనీ తారస్ హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట మార్చకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ కలెక్టర్ ని కోరారు.

రంగంలోకి అమ్మోద డెవలపర్స్

తట్టి అన్నారంలోని ఈ వివాదాస్పద భూములను అమ్మోద డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేటు లిమిటెడ్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నది. అది కూడా రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకుండా కేవలం ఆర్డర్లు కలిగిన ఖనీజ్ ఈ రబాబ్, రజీజ్ ఖానమ్, ముంతాజ్ అలీ, మసూద్ అలీ తదితరుల నుంచి 84 ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే వెంట వెంటనే మ్యుటేషన్ చేశారు. ఇన్ని వివాదాలు కలిగిన భూములపై హక్కులను కట్టబెట్టడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అండదండలతోనే తమ విజ్ఞప్తులను పక్కన పెట్టి అన్యాయంగా, అక్రమంగా తమ భూములను వారి పేరిట మార్చారని బాధితుడు మద్ది శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పుడే వద్దు

తట్టిఅన్నారం రెవెన్యూలో సర్వే నం.90, 91, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 108, 109, 110 లోని భూములపై అనేక ఫిర్యాదులు అందాయి. అమ్మోద డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా మ్యుటేషన్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నది. అయితే రెవెన్యూ రికార్డు ప్రకారం ఖాస్రా పహాణీ నుంచి మద్ది సత్యనారాయణరెడ్డి పేరిట ఉంది. ఆ తర్వాత మీర్ అహ్మద్​అలీ ఖాన్, మీర్ సదత్ అలీ ఖాన్​కుటుంబాల పేరిట కోర్టు డిక్రీ ప్రకారం మ్యుటేషన్ చేయాలంటూ హయత్​నగర్ తాసిల్దార్ ఆర్డర్ ఇష్యూ చేశారు. వీరి వారసుల నుంచి అమ్మోద డెవలపర్స్ అండ్ ప్రమోటర్స్ కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. దాంతో 2009లో వారి పేరిట మ్యుటేషన్ ఆర్డర్ ఇష్యూ అయ్యిందని ఇబ్రహీంపట్నం ఆర్డీవో లేఖ నం.బి/2476/2022, తేదీ.5.8.2022 ద్వారా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి నివేదించారు. వీరి పార్టీల మధ్య పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టులోని మూడు కేసుల్లో ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాతే పరిష్కరించాలని సూచించారు. మరి మ్యుటేషన్ ఎలా చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Also Read : ఫాం ల్యాండ్ల పేరిట ప‌త్తిప‌ల్లిలో ఘ‌రానా మోసం.. మొత్తం ఆయన స‌హ‌కారంతోనే!!

Advertisement

Next Story